తాజా వార్తలు
ప్రపంచంలోనే మొట్టమొదటి శస్త్రచికిత్స
Saturday January 18, 2020

వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకు పోయి కాలు కోల్పోయిన ఓ పులికి వైద్యులు శస్త్రచికిత్స చేసి కృత్రిమ అవయవాన్ని అమర్చిన అరుదైన ఘటన మహారాష్ట్రలోని నాగపూర్ నగరంలో వెలుగుచూసింది. నాగపూర్ ప్రాంతానికి చెందిన సాహెబ్ రావు అనే ఓ పులి 2012 ఏప్రిల్ 26వతేదీన చంద్రాపూర్ జిల్లా తాడోబా అంథేరి పులుల అభయారణ్యంలో వేటగాళ్లు ఏర్పాటుచేసిన వలలో చిక్కి కాలు కోల్పోయింది.ఆర్ధపెడిక్ సర్జన్ సుష్రుత్ బాబుల్కర్, పశువుల డాక్టర్ శిరీష్ ఉపాధ్యాయ్, మహారాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యవిభాగ సైన్సు యూనివర్శిటీ, వన్యప్రాణి పరిశోధన, శిక్షణ కేంద్రం, ఐఐటీ బాంబే నిపుణులు కలిసి ఎడమకాలు కోల్పోయిన పులికి శస్త్రచికిత్స చేసి కృత్రిమ కాలిని అమర్చారు. గోరేవాడ పునరావాస కేంద్రంలో పులికి శస్త్రచికిత్స చేసి కృత్రిమ అవయవాన్ని అమర్చారు. ఈ శస్త్రచికిత్సలో అటవీ అభివృద్ధి సంస్థ అధకారులు కూడా పాల్గొన్నారు. గతంలో కుక్కలు, ఏనుగులకు కృత్రిమ అవయవాలు ఏర్పాటు చేశారు. కాని ప్రపంచంలోనే మొట్టమొదటిసారి పులికి కృత్రిమ కాలు అమర్చిన ఘటన మహారాష్ట్ర పశుసంవర్థక శాఖ డాక్టర్ల బృందానికి దక్కింది

బొత్స నోట.. తన్నుకొచ్చిన నిజం
Saturday January 18, 2020

రాజధానిపై అధికార పక్షం చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్న విషయం తెలిసిందే. ఒక్కొక్కరూ ఒక్కోలా వ్యాఖ్యానిస్తూ.. రాజధాని రైతులను గందరగోళపరుస్తున్నారు. ఇదిలా ఉంటే రాజధానిపై రాష్ట్ర మంత్రి బొత్స సత్యానారాయణను మీడియా ప్రశ్నించగా.. ఎదురు ప్రశ్నలతో సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు. దీనిపై టీడీపీ నేత నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాజధానిపై గతంలో బొత్స మాట్లాడిన మాటలను.. తాజాగా మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలను ట్వీట్ చేస్తూ.. ఈ అబద్ధపు నోట తన్నుకొచ్చిన నిజం అని టైటిల్ పెట్టారు. భూకబ్జాల కోసమే రాజధాని మార్పు చేస్తున్నారన్న విషయాన్ని బొత్స స్వయంగా ఒప్పుకున్నారని లోకేశ్ ట్వీట్ చేశారు.      ప్రతిపక్ష నాయకుడిగా బొత్స మాట్లాడుతూ.. రాజధాని అక్కడే ఉంటుంది.. అక్కడే ఉండాలి కూడా.. జగన్మోహన్ రెడ్డి కూడా అదే విషయం చెప్పారు. మేమంతా కోరేది కూడా అదే. ఎవరైతే భూకబ్జాలు చేస్తారో.. వాళ్లకు కావాలి రాజధాని మార్పు అని వ్యాఖ్యానించారు. నిన్న మాత్రం ఆ మాటలకు ఎక్కడా పొంతన లేకుండా మాట్లాడారు. రాజధాని ఎక్కడ అంటే ఏం చెప్పాలి సార్.. అని ఓ విలేఖరి ప్రశ్నించగా.. ఐదేళ్ల పూర్తయ్యే వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదని.. అడ్రస్ లేకుండా.. నోటిఫికేషన్ లేనప్పుడు.. ఇప్పుడు వచ్చి ప్రశ్నిస్తున్నారా అని మీడియానే ఎదురు ప్రశ్నించారు. మూడు రాజధానులు తామనలేదని.. వాళ్లు చేసిన రికమెండేషన్ అని అన్నారు.

జనసేన అంతర్జాతీయ పార్టీ కావొచ్చేమో
Friday January 17, 2020

జనసేన, బీజేపీ పొత్తుపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీలో జనసేన-బీజేపీ పొత్తుపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. పొత్తుపై ఇప్పుడే స్పందించలేనన్న ఆయన.. జనసేన అంతర్జాతీయ పార్టీ కూడా కావొచ్చేమో అని వ్యాఖ్యానించారు. అయినా పక్కరాష్ట్రంలో పవన్‌ ఏం చేస్తే తమకేంటని అన్నారు. ఆ విషయాన్ని ఏపీ ప్రజలు చూసుకుంటారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.       ఏపీలో బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. విజయవాడలో జరిగిన ఇరుపార్టీల సమావేశంలో పొత్తుపై అధికారిక నిర్ణయం తీసుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా తమ కూటమి పని చేస్తుందని.. అధికారంలోకి వచ్చేది తమ ప్రభుత్వమేనని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. 

ప్రధాన వార్తలు
పోటీ పరీక్షల్లో దూకుడు.. ఐఐటీకి వెళ్లాక ఢమాల్‌
Saturday January 18, 2020

తెలుగు విద్యార్థులను క్యాంపస్‌ కష్టాలు వెంటాడుతున్నాయి. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో లక్షల మంది విద్యార్థులతో పోటీ పడి సత్తా చాటుతున్నా, తిరుగులేని ర్యాంకులు కైవసం చేసుకుని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో సీట్లు సంపాయిస్తున్నా, తర్వాత మాత్రం మన వాళ్లు చతికిల పడుతున్నారు. ఐఐటీల్లో చేరే ఇతర రాష్ట్రాల విద్యార్థులతో కలివిడిగా ఉండలేకపోతున్నారు. బృంద చర్చల్లోను, ఇతర కార్యక్రమాల్లోను వెనుకబడిపోతున్నారు. ఫలితంగా ప్రతిష్ఠాత్మక ప్రపంచస్థాయి సంస్థల్లో ఉద్యోగాలను దక్కించుకోలేక ఉసూరుమంటున్నారు. మరి దీనికి కారణాలు ఏంటి? మనోళ్లలో సత్తాలేదా లేక.. సరైన అవగాహనలేదా? ఎందుకు వెనుకబడిపోతున్నారు? ఇప్పుడు వీటిపైనే దృష్టి పెట్టింది రాష్ట్ర ఉన్నత విద్యా మండలి. క్యాంపస్‌ కష్టాలను తరిమికొట్టేలా.. అందరితోనూ కలిసిపోయి.. సత్తా చాటేలా.. అత్యుత్తమ సంస్థల్లో ఉద్యోగాలు దక్కించుకునేలా విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు సిద్ధమైంది. వాస్తవానికి జాతీయ స్థాయిలో నిర్వహించే ఉమ్మడి పోటీ పరీక్షల్లో సత్తా చూపుతూ ఐఐటీలు, డీమ్డ్‌ విద్యా సంస్థల్లో ఏపీ విద్యార్థులు సీట్లు సొంతం చేసుకుంటున్నారు. కానీ, ఆ తర్వాత క్రమంలో మాత్రం ఇబ్బంది పడుతున్నారు.     రాష్ట్రంలో ప్రస్తుతం కార్పొరేట్‌ విద్యాసంస్థల హవా కొనసాగుతోంది. ఇంటర్‌ వరకు విద్యార్థులను తరగతిగదికి పరిమితం చేయడం, అకడమిక్‌ పరంగా ఆయా పాఠ్యాంశాల్లో బట్టీయం విధానంలో విద్యార్థులను సంసిద్ధులను చేయడం వరకే ఆయా సంస్థలు దృష్టి పెడుతున్నాయి. అంతేతప్ప కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, బృంద చర్చలపై దృష్టి పెట్టడంలేదు. ఐఐటీల్లో కనీసం నాలుగైదు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉంటారు. వారితో తెలుగు వాళ్లు కలివిడిగా ఉండలేని పరిస్థితి నెలకొంటోంది. అత్యంత కీలకమైన బృంద కార్యక్రమాల్లోనూ వెనుకబడిపోతున్నారు. అదేసమయంలో నాయకత్వ లక్షణాలు కూడా అంతంత మాత్రంగా ఉంటున్నాయి. ఏపీ విద్యార్థులు ఐటీలో కొంత వరకు ఫర్వాలేదని, కోర్‌ ఇంజనీరింగ్‌, తయారీ రంగంలోను బాగా వెనకబడిపోతున్నారని ముంబయి, మద్రాస్‌, ఖరగ్‌పూర్‌ ఐఐటీలకు చెందిన ప్రొఫెసర్లు అభిప్రాయపడుతున్నారు.

కేంద్రం చూస్తూ ఊరుకోదు: సుజనా
Saturday January 18, 2020

మూడు రాజధానులపై వైసీపీ ఏకపక్షంగా ముందుకెళ్తే... కేంద్రం చూస్తూ ఊరుకోదని బీజేపీ నేత సుజనాచౌదరి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ అధికారంలో ఎవరుంటే వారికి ఉద్యోగులు డబ్బా కొట్టొద్దని వ్యాఖ్యానించారు. అమరావతి రాజధానిగా అనుకున్నప్పుడు వైసీపీ అభ్యంతరం చెప్పలేదని గుర్తుచేశారు. అమరావతికి కేంద్రం రూ.2500 కోట్లు ఇచ్చిందని తెలిపారు. ప్రజల సొమ్మును వృథా చేస్తామంటే ఊరుకునేదిలేదని సుజన హెచ్చరించారు. రాజధాని తరలింపు నిర్ణయాన్ని వైసీపీ ఉపసంహరించుకోవాలన్నారు. 13 జిల్లాల అభివృద్ధిపై వైసీపీ దృష్టి సారించాలని సూచించారు. జగన్‌ పాలనపై దృష్టిపెట్టి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని హితవుపలికారు. రాజధాని అమరావతి కోసం ప్రజా ఉద్యమమే కాదు... న్యాయపరంగానూ ముందుకెళ్తామని బీజేపీ నేత సుజనాచౌదరి స్పష్టం చేశారు.   అమరావతిలో జరుగుతున్న పరిణామాలను కేంద్రం పరిశీలిస్తోందని తెలిపారు. అధికార ప్రకటన వెలువడిన తర్వాత కేంద్రం జోక్యం చేసుకుంటుందని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న చర్యతో వైసీపీ ప్రజాప్రతినిధులే సంతోషంగా లేరన్నారు. రాజధాని ఒక ప్రాంతానికి సంబంధించిన అంశం కాదని సుజన అన్నారు. సీఎం పదవిలో ఎవరున్న ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చారని, చంద్రబాబుని చూసి కాదని అన్నారు. రాజధాని ఒక్క అంగుళం కూడా జరగదని స్పష్టం చేశారు. అమరావతి తరలింపు నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వస్తుందని సుజనాచౌదరి ఆందోళన వ్యక్తం చేశారు.  

నిర్భయ దోషికి ఉరే సరి
Friday January 17, 2020

నిర్భయ హత్య కేసులో దోషి ముఖేశ్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం తిరస్కరించారు. ముఖేశ్ క్షమాభిక్షను తిరస్కరించండంటూ కేంద్ర హోంశాఖ వర్గాలు శుక్రవారం ఉదయం రాష్ట్రపతికి విన్నవించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి నిందితుడి క్షమాభిక్షను తిరస్కరించినట్లు హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ సంచలన నిర్ణయంపై నిర్భయ తండ్రి స్పందించారు. ‘‘చాలా మంచి విషయం. ఉరిశిక్ష అమలు చేయడం ఆలస్యమవుతుందనే వార్త తమ ఆశలను ఆవిరి చేసింది’’ అని తండ్రి పేర్కొన్నారు.    నిర్భయ కేసులో నలుగురు దోషులను ఉరి తీస్తామని ప్రకటించిన తర్వాత ముఖేశ్ పెట్టుకున్న క్షమాభిక్ష కొంత ఆటంకం కలిగించిన విషయం తెలిసిందే. ఆయన క్షమాభిక్ష రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నందున ఆయన ఉరి శిక్షను వాయిదా వేయాలని ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టును కోరింది. కారాగార నిబంధనల ప్రకారం కేసులో ఉన్నవారు క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకుంటే అది తేలే వరకు శిక్ష అమలు చేయడం కుదరదని పేర్కొంది. దీంతో నిర్భయ దోషులను ఉరిశిక్షపై కొంత సందిగ్ధత ఏర్పడింది. రాష్ట్రపతి కోవింద్ చేసిన తాజా ప్రకటనతో ఉరిశిక్ష ఎప్పుడు వేస్తారో తేలాల్సి ఉంది.

బిజినెస్
ఫోన్‌ చెడిందా.. కంగారొద్దు
Saturday January 12, 2019

మా దగ్గర మీరు కొన్న ఫోన్‌ చెడిపోతే మీరు మా దగ్గరకు రావాల్సిన అవసరం లేదు. సమాచారం ఇస్తే మేమే మీ ఇంటికి వచ్చి ఫోన్‌ను పరిశీలిస్తాం... అది రిపేర్‌ కావడానికి సమయం పడితే రిపేర్‌ అయ్యేవరకు ఒక ఫోన్‌ వాడుకోవడానికి ఇస్తామంటూ చిన్న సెల్‌షాపులు, షోరూంలు ఈ వారం నుంచి ప్రచారం ప్రారంభించాయి.     సెల్‌ చెడిపోతే అప్పటివరకు ఫోన్ సేవలకు అవాంతరం అవుతుందని, అందువలన వినియోగదారులకు అంతరాయాలు లేకుండా ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు అభిప్రాయ పడుతున్నారు. అయితే పెద్ద షోరూంలలో ఈ సదుపాయం లేదు. చిన్న షాపుల వారు మాత్రమే ఈ ఆఫర్లు పెట్టారు. పెద్ద షో రూంలలో ధరల తగ్గింపు ప్రభా వాన్ని తట్టు కోవడానికే ఈ ఆఫర్లు ప్రకటించారు. దీంతో వినియోగ దారులతో నేరుగా సంబంధాలు ఏర్పర్చుకొని వారిని సంతృప్తిని పరచడం ద్వారా వ్యాపార విస్తృతి కోసం దీనిని ప్రకటిస్తున్నారు.

పతనమవుతున్న బెల్లం ధరలు
Wednesday December 12, 2018

అనకాపల్లి: ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డులో బెల్లం ధరలు రోజు రోజుకి పతనమవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 8వ తేదీన ఒకటోరకం వంద కిలోలు రూ.3110 పలకగా మధ్యరకం రూ. 2770లకు పలికింది. నల్లబెల్లం రూ.2520లకు పలికాయి. 10న ఒకటోరకం రూ.3060, మధ్యరకం రూ.2740, నల్లబెల్లం రూ. 2490లకు పడిపోయింది. మంగళవారం ఒకటో రకం రూ.3000లకు పడిపోగా మధ్యరకం రూ. 2710కి తగ్గిపోయింది. నల్లబెల్లం రూ.2530కి పెరిగింది. వాస్తవానికి ఒకటో రకం బెల్లం దిమ్మలు తక్కువగా వస్తుంటాయి. దాని తరువాత రకాన్నే ప్రమాణికంగా తీసుకోవాలి. ఆతరువాత రకమైతే రూ.2860లకు పలికినట్టు వర్తకులు చెబుతున్నారు. ఇతర మార్కెట్‌ల్లో ధరలు తక్కువగా ఉండడంతో వాటి ప్రభావం అనకాపల్లి మార్కెట్‌పై కూడా పడుతుందని వర్తకులు చెప్పారు.   అలాగే మహారాష్ట్ర, కర్ణాటక బెల్లాలు ఇతర రాష్ట్ర వర్తకులకు రవాణాతో సహా కలుపుకొని తక్కువ రేటుకు అమ్మకాలు చేయడంతో అనకాపల్లి మార్కెట్‌కు ఆర్డర్లు తగ్గుతున్నాయని వర్తకులు తెలిపారు. సంక్రాంతి పండుగ సమయంలో బెల్లం ధరలు పడిపోతుండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మూడేళ్లుగా చెరకు పంటకు తెగుళ్లు సోకి ఆర్థికంగా నష్టపోతున్న సమయంలోనైనా రాష్ట్ర ప్రభుత్వం చెరకు రైతులను ఆదుకుంటే బాగుంటుందని పలువురు అంటున్నారు. రాష్ట్ర ప్రభు త్వం క్రిస్మస్‌, సంక్రాంతి పండుగల పర్వదినం సందర్భంగా ఇచ్చే చంద్రన్న కానుకకు అనకాపల్లి బెల్లా న్ని కొనుగోలు చేసి ఉంటే రైతులకు కొంతైనా గిట్టుబాటు ధర లభించేదని చెరకు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కర్రి అప్పారావు తెలిపారు.

ఆటో మొబైల్ రంగంలో ఏపీ మరో ముందడుగు
Thursday December 06, 2018

అమరావతి: ఆటో మొబైల్ రంగంలో ఆంధ్రప్రదేశ్ మరో ముందడుగు వేయనుంది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో కియా మోటార్స్‌తో ఎంవోయూ కుదుర్చుకోనున్నారు. ప్రతి ఏటా 3 లక్షల కార్లను కియా మోటార్స్‌ తయారు చేయనుంది. ఏపీలో ప్లాంట్ నిర్మాణానికి 1.6 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు కియా కంపెనీ సిద్ధమైంది. కియో మోటార్స్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 11 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలోనే కార్లను రోడ్డుపైకి తెచ్చేలా కియా ప్రణాళిక సిద్ధం చేసుకుంది.

రాజకీయాలు
మేం చెప్పేవన్నీ అబద్ధాలేనంటారా?
Friday January 17, 2020

రాజధాని రైతుల ఆందోళనల విషయంలో హైపవర్‌ కమిటీ సిద్ధం చేసిన నివేదికను సీఎం జగన్మోహన్ రెడ్డికి అందజేసినట్లు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వచ్చే కేబినెట్‌ భేటీలో ఈ నివేదికపై చర్చించనున్నట్లు ఆయన వెల్లడించారు. శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతిలో రైతుల ఆందోళనను సీఎం దృష్టికి తీసుకెళ్లామని, వారికి న్యాయం జరిగేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు చెప్పారు. సీఆర్డీఏ చట్టం రద్దు విషయం తమ దృష్టిలో లేదన్నారు. హైపవర్‌ కమిటీ ఈమెయిల్‌ను ఎవరో హ్యాక్‌ చేశారని బొత్స ఆరోపించారు. కొందరు రాజధాని ప్రాంత రైతులు తమను కలిసి సమస్యలు వివరించినట్లు ఆయన తెలియజేశారు.   అమరావతి రాజధానికి అనుకూలం కాదని చెన్నై ఐఐటీ నివేదిక ఇవ్వలేదంటోంది కదా అనే ప్రశ్నకు బొత్స నేరుగా సమాధానం చెప్పలేదు. ‘కావాలంటే మీరు కూడా చెన్నై ఐఐటీకి మెయిల్‌ పెట్టుకోండి. మేం చెప్పేవన్నీ అబద్ధాలే అంటారా? శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక కూడా అబద్ధమేనా?’ అంటూ మీడియా ప్రతినిధులను ఆయన ఎదురు ప్రశ్నించారు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలపై తానేం మాట్లాడగలను? అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ భవనం గురించి అడగ్గా.. ఈ అసెంబ్లీ పర్మినెంట్‌ అని చంద్రబాబు ఎప్పుడైనా అన్నారా? అని ఎదురు ప్రశ్నించారు. చంద్రబాబే తాత్కాలిక భవనం అన్నప్పుడు, దాన్ని తామెలా శాశ్వత భవనం అంటామని అడిగారు. చంద్రబాబుకు తన సామాజికవర్గం పట్ల తప్ప, సమాజం పట్ల అంకిత భావం లేదని విమర్శించారు.

ఇతర పార్టీలు మాటలు నమ్మి మోసపోవద్దు
Sunday January 12, 2020

అమరావతిని ఎత్తేస్తామని సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎప్పుడూ చెప్పలేదని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కవాతులు నిర్వహిస్తే టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి ముందు నిర్వహించాలన్నారు. అమరావతి పేరుతో ఇతర జిల్లాలను విస్మరించింది చంద్రబాబేనన్నారు.   చంద్రబాబు అండ్ కో చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు.కావాలనే చంద్రబాబు రాజధాని ప్రజలను రెచ్చగొడుతూన్నాడు. అన్ని ఒక చోటే ఉంటే రాష్ట్ర అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది?. రాజధాని రైతులకి ప్రభుత్వం అండగా ఉంటుంది..ఇతర పార్టీలు మాటలు నమ్మి మోసపోవద్దు. రాజధాని తరలింపు చీకటిలో చేసేది కాదు. 20న శాసనసభలో చర్చించే నిర్ణయం ఉంటుంది. మహిళా కమిషన్ సభ్యులు విచారణ చేయటంలో తప్పులేదు. మేము ఏమీ తప్పు చేయలేదు. రైతులందరితో చర్చించి వారికి తగిన న్యాయం చేస్తాం’ అని మంత్రి అవంతి హామీ ఇచ్చారు.

అడ్డుకోవడం క్రిమినల్ చర్య.... లోకేష్
Thursday December 12, 2019

అమరావతి: శాసనమండలి ప్రారంభం నుంచే సభ్యులను అగౌరవపరిచే రీతిలో మార్షల్స్ వ్యవహరిస్తున్నారని, సభ్యులను అడ్డుకునే అధికారం మార్షల్స్‌కు ఎవరిచ్చారని టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. మండలిలో ఆయన మాట్లాడుతూ ఇదే తీరు కొనసాగితే తాము శాసనమండలికి వచ్చే పరిస్ధితి ఉండదని అన్నారు. మహిళల పట్ల మార్షల్స్ అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు.   ఎప్పుడూ లేని విధంగా సభ్యులను గేటువద్దే నిరోధించడం అసమంజసమని, యనమల రామకృష్ణుడు, మెంబర్స్‌ను అడ్డుకోవడం క్రిమినల్ చర్యగా లోకేష్ అభివర్ణించారు. సభ్యులను అడ్డుకుంటే తాము రామని, సభను మీరే నడుపుకోండని అన్నారు. రెండు అటానమస్ బాడీలకు ప్రత్యేక అధికారాలు ఉంటాయన్నారు. ఫ్లోర్ లీడర్లు, లెజిస్లేటివ్ వ్యవహారాల మంత్రి, ఛీఫ్ మార్షల్‌ను పిలిపించి మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. లోకేష్ వ్యాఖ్యలపై స్పందించిన శాసనమండలి చైర్మన్ షరీఫ్..సభ్యుల పట్ల అగౌరవంగా ప్రవర్తించడం అసమంజసమని అన్నారు. సభ్యులను మార్షల్స్ అగౌరవ పరచకుండా ఉండే విధంగా రూలింగ్ ఇస్తున్నామన్నారు. ఆడవారిని ఆడవారే, మగవారిని మగవారే తాకకుండా సభకు పంపించాలని ఛీఫ్ మార్షల్‌కు ఆదేశాలు జారీ చేస్తూ.. ఫ్లోర్ లీడర్లు, లెజిస్లేటివ్ వ్యవహారాల మంత్రి, ఛీఫ్ మార్షల్‌ను పిలిపించి మాట్లాడుతామని చెప్పడంతో ప్రశ్నోత్తరాలు ప్రారంభమయ్యాయి.

మంచిమాట
నేటి మంచి మాట .....
Friday June 08, 2018

*సలహా అనేది ఎవరికి అత్యవసరమో, వారికే రుచించదు. *  తనను తాను సంస్కరించుకున్న వ్యక్తి కె ఇతరులను సంస్కరించే అధికారం అందుతుంది.