ప్రధాని రేసులో నేను లేను: చంద్రబాబు

Published: Friday October 05, 2018
ప్రధానమంత్రి పదవికి అభ్యర్థిని ముందే ప్రకటించకున్నా.. బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఆటోమేటిగ్గా దానంతట అదే ఆవిర్భవిస్తుందని టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తంచేశారు. తాను ప్రధాని పదవికి రేసులో లేనని స్పష్టం చేశారు. గురువారం ఆయన à°“ వార్తాసంస్థతో మాట్లాడారు. ఐక్యకూటమి ఏర్పాటు దిశగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తానని చెప్పారు. ప్రధాని అభ్యర్థిని ముందుగా ప్రకటించనంత మాత్రాన ప్రత్యామ్నాయ కూటమి విజయావకాశాలు దెబ్బతినవని వ్యాఖ్యానించారు. కూటమి ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి, జేడీఎస్‌ అధ్యక్షుడు హెచ్‌à°¡à±€ కుమారస్వామితో తాను చర్చించానని, ఇతర పార్టీలతోనూ సంప్రదింపులు సాగుతున్నాయని తెలిపారు.
 
‘రాజకీయ పొత్తులు రాత్రికిరాత్రి ఖరారయ్యేవి కావు. ఎన్నికల ముందైనా.. తర్వాతైనా కుదరవచ్చు. గతంలో కూడా విభిన్న పరిస్థితుల్లో ఎన్నికల ముందు.. ఎన్నికల అనంతరం అవగాహనలు కుదిరాయి. గతంలో కొన్ని సందర్భాల్లో ప్రధాని అభ్యర్థి ఎవరో ఊహించలేకపోయేవారు. వివిధ పరిస్థితుల ఆధారంగా అభ్యర్థి ఎంపిక ఉంటుంది. ఒక్కోసారి ముందుగానే ప్రధాని అభ్యర్థిని ప్రకటించడం కూడా మంచిది కాదు. ప్రతిపక్షాల కూటమి ఏర్పడకుండా దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంటుంది’ అని అభిప్రాయపడ్డారు. ప్రధాని పదవికి రేసులో ఉన్నారా అని అడుగగా.. తాను ఎప్పటికీ కేంద్రప్రభుత్వంలోకి వెళ్లనని సీఎం తేల్చిచెప్పారు. కేంద్రంలో ఎలాంటి పదవుల రేసులో లేనని.. ఎలాంటి భూమికా పోషించనని తెలిపారు.
 
‘నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. 1995లోనే ముఖ్యమంత్రినయ్యాను. యునైటెడ్‌ ఫ్రంట్‌తో, ఎన్డీఏతో పనిచేశాను. ఇప్పుడున్నంత దారుణ పరిస్థితులు ఎప్పుడూ లేవు. దేశం దయనీయ పరిస్థితిలో ఉంది. ఆర్థిక పరిస్థితి బలహీనంగా మారింది. ప్రతి పౌరుడూ బాధపడుతున్నాడు. పెట్రో ధరలు మండిపోతున్నాయి. రూపాయి మారకం విలువ క్షీణిస్తోంది. నోట్ల రద్దు అట్టర్‌ఫ్లాప్‌. ప్రజలకు బ్యాంకులపై నమ్మకం పోయింది. బ్యాంకులను ముంచినవారు దేశాన్ని వదిలిపోయారు. రైతుల సమస్యలను సరిగా పరిష్కరించడం లేదు. ప్రజల పట్ల బాధ్యతల నిర్వహణలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయక.. ప్రజాదరణ కోల్పోయింది. ఎన్నికల హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదు. అందరిలాగే మోదీ ఎంతో చేస్తారని నేనూ ఆశించాను. మోదీ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వారు కచ్చితంగా ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటారు’ అని పేర్కొన్నారు. రాఫెల్‌ వ్యవహారంలో వచ్చిన ఆరోపణలకు ప్రధాని జవాబివ్వాలని డిమాండ్‌ చేశారు.