‘సీఎం పవర్ స్టార్’ జరిగి తీరుతుంది
Published: Tuesday November 06, 2018

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తానే ముఖ్యమంత్రి అవుతానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రజాపోరాటయాత్రలో భాగంగా సోమవారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘ధవళేశ్వరం కవాతుకు పది లక్షల మంది వచ్చారు. మిగతా పార్టీల్లా డబ్బు, సారా, బిర్యానీ ఇవ్వలేదు. ఏమిస్తే మీ రుణం తీర్చుకోగలను? జనసేన పెట్టి మీకు ఇలా సేవ చేసుకునే భాగ్యం కలిగింది. మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా ఉందంటే.. దేవుడు లేని ఊరిలో మంచం కోడే పోతురాజు.. మనకు ఇప్పుడు మహాత్మాగాంధీ, అంబేడ్కర్, నెహ్రూలాంటివారెవరూ లేరు.. మనకున్నదల్లా జగన్, చంద్రబాబు, లోకేశ్‌లే... జగన్‌ను చూద్దామంటే ఆయన మీద కేసులున్నాయి. చంద్రబాబును చూస్తే అవినీతి పెరిగిపోయింది..’ అని వ్యాఖ్యానించారు.
ఈ సమయంలో అభిమానులంతా ‘సీఎం పవర్‌స్టార్.. సీఎం పవర్‌స్టార్..’ అని అరుస్తుంటే.. పవన్ స్పందిస్తూ.. ‘సీఎం పవర్‌స్టార్ అంటే అదొక మంత్రం. ఇది కచ్చితంగా 2019లో జరిగి తీరుతుంది. ‘సరికొత్త సమీకరణలవల్ల జనసేన అధికారంలోకి వస్తుంది. టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో రాదు. జగన్ కూడా ప్రభుత్వాన్ని స్థాపించలేరు’ అని స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేశ్, మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్పపై తీవ్ర విమర్శలు చేశారు. ‘మీరు చేసిన పాపాలకు చింతకాయల్లా రాలిపోతారు. మిమ్మల్ని వెనకేసుకొచ్చిన వాళ్లు దీపావళి టపాసుల్లా రాలిపోతారు. ఈ దీపావళి నరకాసుర వధ. మొన్న దసరా మహిషాసురమర్దని. అవధూత వెంకయ్యస్వామి చెప్పినట్లు అవినీతిపరులను వెనకేసుకొచ్చే వాళ్లు దీపావళి టపాకాయల్లా పేలిపోతారు’ అని పేర్కొన్నారు.
‘2014లో చంద్రబాబుకు సపోర్టు చేయడం అప్పటి ధర్మం. 2019లో టీడీపీని రానివ్వకపోవడం ఇప్పటి ధర్మం. ఎన్టీఆర్ పెద్దాపురం వద్ద సూరంపాలెంలో 470 ఎకరాల భూముల్ని దళితులకు ఇచ్చారు. ఆ భూముల్ని లాక్కుని టీడీపీ వాళ్లు రెండు వేల కోట్లు దోచుకున్నారు. లోకేశ్ గారూ.. మీ తాతగారిచ్చిన భూముల్లో.. మట్టి తవ్వేసి అమ్మేసుకుంటున్నారు. మట్టి అవినీతిని సాక్ష్యాధారాలతో నిరూపిస్తా.. వస్తారా..’ అంటూ సవాల్ చేశారు. ఇలాంటి వాటి గురించి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మాట్లాడరని ఎద్దేవా చేశారు. ‘చినరాజప్ప ఏం చేస్తున్నారు..? కడియం నర్సరీవాళ్లు రెండడుగులు తవ్వుకుంటే మాత్రం కేసులు పెట్టిస్తారు. పచ్చని భూముల్ని లాక్కున్నారు. ఇలాంటి పనులు చేస్తుంటే ప్రకృతి చూస్తూ ఊరుకుంటుందా? దేవుడు లేడా? ధర్మాన్ని రక్షించడానికే వచ్చా’ అని చెప్పారు. కర్ణాటకలో 40 సీట్ల కంటే తక్కువ వచ్చిన వాళ్లు సీఎం కాగలిగారని, ఢిల్లీలో కేజ్రీవాల్ గెలిచారని.. ఇవన్నీ బలమైన మార్పునకు సంకేతాలని చెప్పారు.

Share this on your social network: