వెలుగులోకి వచ్చిన దొంగ సర్టిఫికెట్ల వ్యవహారం
Published: Tuesday December 11, 2018

పారా మెడికల్ కోర్సులకు పెరిగిన డిమాండును సొమ్ము చేసుకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి కొన్ని సంస్థలు రంగప్రవేశం చేశాయి. మూడేళ్ల డిగ్రీ కోర్సు, మరో ఏడాది ఇంటర్న్‌షిప్ చేస్తేగాని రాని సర్టిఫికెట్‌ను... జస్ట్ వారంరోజుల్లో ఇచ్చేస్తామంటూ వీరు వల వేస్తున్నారు. డిప్లొమాకైతే ఏడాదికి రూ.35వేలు, డిగ్రీకైతే రూ.1.50లక్షలు వసూలు చేస్తున్నారు. మహరాష్ట్రకు చెందిన నాసిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పారా మెడికల్ సైన్సెస్ సంస్థ ఈ దందాకు శ్రీకారం చుట్టింది. విజయవాడ, గుంటూ రు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఆశావహులు లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తోందని సమాచారం. తాజాగా విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్ వేదికగా సుమారు 60మంది విద్యార్థులకు సర్టిఫికెట్లను అందించడానికి రంగం సిద్ధం చేసుకొన్నారు. సమాచారం తెలుసుకొన్న పారా మెడికల్ కళాశాలల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బీఎం రత్నం, సంస్థ జిల్లా సభ్యులు పార్థసారథికి సమాచారం అందించారు. ఆయన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరు ఇచ్చే సర్టిఫికెట్లు చెల్లవని పారామెడికల్ బోర్డు ప్రస్తుత సెక్రటరీ డాక్టర్ శశాంక, పోలీసులకు స్పష్టం చేశారు.
పారా మెడికల్ కోర్సుల సర్టిఫికెట్ల అమ్మకాలు చేస్తున్న సంస్థలు పక్కాప్లాన్‌తో రంగంలోకి దిగుతాయి. కేవలం 4గంటల్లో మొత్తం తతంగాన్ని పూర్తి చేస్తాయి. ఎవరికీ అనుమానం రాకుండా మారుమూల ప్రాంతా ల్లో, గుర్తింపు లేని హోటళ్లలో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తాయి. విద్యార్థులకు వలపన్నడం, డబ్బులు వసూలు చేయడం వంటి కార్యకలాపాలకు స్థానికంగా ఇద్దరు లేదా ముగ్గురు ఏజెంట్లను నియమించుకుంటాయి. ఆరు నెలల ముందు నుంచే సర్టిఫికేట్లు అవసరమైన అభ్యర్థుల కోసం వెతుకులాట ప్రారంభిస్తారు. సుమారు 30నుంచి 50మంది పైన ఉంటేనే సర్టిఫికేట్లు అందించేందుకు సిద్ధమవుతారు. అభ్యర్థుల నుంచి వారం ముందుగానే సగం డబ్బులు తీసుకుంటారు. మిగిలిన సగం సర్టిఫికేట్లు చేతిలో పెట్టిన తర్వాత అందించాలలి నిబంధన విధిస్తారు. మొదటి విడత డబ్బు అందిన వెంటనే సంస్థ ప్రతినిధులు ఆ ప్రాంతానికివచ్చి సమావేశం ఏర్పాటు చేస్తారు. రెండు గంటల పాటు రెండు క్లాస్‌లు నిర్వహిస్తారు. ఒక గంట లంచ్ బ్రేక్ ఇస్తారు. నాలుగో గంటలో సర్టిఫికేట్లు సిద్ధం చేస్తారు. మిగిలిన సగం డబ్బులు ఇవ్వగానే అభ్యర్థుల చేతుల్లో సర్టిఫికెట్లు పెట్టి వెళ్లిపోతారు. అభ్యర్థుల నుంచి తీసుకున్న మొత్తంలో ఏజెంట్లకు 10నుంచి 30 శాతం ఇస్తారు. ఆ తర్వాత ఏజెంట్లకు, సంస్థ ప్రతినిధులకు సంబంధం ఉండదు. తమకు అందిన సర్టిఫికెట్లు చెల్లుబాటు అవుతాయో లేదో అభ్యర్థులు తెలుసుకునే సమయం అటు ఏజెంట్లుగానీ, ఇటు సంస్థ ప్రతినిధులుగానీ ఇవ్వరు.

Share this on your social network: