కన్నతల్లే చంపేయమంది!
Published: Tuesday December 25, 2018

పిల్లలపై తండ్రి కోపంతో ఊగిపోతే.. తల్లి శాంత పరుస్తుంది! తల్లి కోపగించుకుంటే ఆ బాధ్యత తండ్రి తీసుకుంటాడు! మరి.. అనురాధది ఎంత విషాదమో కదా! కూతురు కులాంతర వివాహం చేసుకుందనే ఆగ్రహంతో తండ్రి అనురాధను తీవ్రంగా కొట్టాడు. తోడబుట్టిన అన్న కూడా ఆమెపై చేయి చేసుకున్నాడు! అంతా చూస్తున్న తల్లి.. దెబ్బల బాధతో విలవిల్లాడుతున్న కూతురును కొట్టవద్దని భర్తకు చెప్పలేదు. కొడుకునూ వారించలేదు. పైగా ‘దాన్ని చంపేయండి’ అంటూ వారికి చెప్పింది. సాక్షాత్తు కన్నతల్లి లక్ష్మి చెప్పడంతోనే తండ్రి సత్యయ్య.. కూతురు అనురాధను గొంతు పిసికి చంపాడు. తర్వాత అన్న మహేశ్ ఆమె మృతదేహాన్ని కాల్చేసి బూడిదను కాల్వలో కలిపివేశాడు. ఈ మేరకు మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం కలమడుగుకు చెందిన అనురాధను పక్కా ప్రణాళిక ప్రకారం ఆమె కుటుంబసభ్యులే హత్య చేశారని పోలీసుల విచారణలో వెల్లడైంది. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం మల్లాపూర్‌లో అనురాధ మృతదేహాన్ని కాల్చివేయగా.. ఆ స్థలాన్ని రామగుండం సీపీ సత్యనారాయణ సోమవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా నిందితులను స్వయంగా వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన, అక్కడే మీడియాతో మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాల మేరకు కలమడుగుకు చెందిన పిండి అనురాధ, అయ్యోరు లక్ష్మణ్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 3న హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. అనంతరం వరంగల్‌లో కాపురం పెట్టారు. పెళ్లికి ముందు అనురాధతో లక్ష్మణ్‌పై ఆమె తల్లిదండ్రులు కేసుపెట్టించారు. ఈ నెల 23న లక్సెట్టిపేట కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్‌కు అనురాధ, లక్ష్మణ్ హాజరయ్యారు. అనంతరం ఇంటికి వెళ్దామనుకొని స్థానిక పోలీ్‌సస్టేషన్‌ను ఆశ్రయించారు.
అనురాధ తల్లిదండ్రులను కౌన్సెలింగ్ కోసం పోలీ్‌సస్టేషన్‌కు రావాలని పిలిచినా తాము ఆస్పత్రికి వెళ్లామని, మరుసటిరోజు వస్తామని చెప్పడంతో అనురాధ, లక్ష్మణ్‌లను పోలీసుల సాయంతో ఇంటి వద్ద దింపి వచ్చారు. పోలీసులు వెనక్కివచ్చిన తర్వాత రాత్రి 7:30 గంటలకు అనురాధ తండ్రి సత్యయ్య, తల్లి లక్ష్మి, అన్న మహేశ్‌తో పాటు నక్క రమేశ్, రాజన్న, జీలపెల్లి స్వామి... లక్ష్మణ్ ఇంటి మీదకు వెళ్లారు. అనురాధను బలవంతంగా బయటకు లాగి.. కొట్టుకుంటూ ఇంటికి తీసుకెళ్లారు. దెబ్బలకు తాళలేక ఆమె అప్పటికే సొమ్మసిల్లిపోయింది. నీళ్లు చల్లి లేపి లక్ష్మణ్‌ను మర్చిపోవాలని హెచ్చరించినా ఆమె ఒప్పుకోలేదు. అనంతరం తండ్రి ఒక బైకుపై.. మరోబైక్‌పై మహేశ్, రమేశ్‌లు అనురాధను కూర్బోబెట్టుకొని నిర్మల్ జిల్లా మల్లాపూర్ గ్రామ శివారుకు చేరుకున్నారు. నక్క లింగమూర్తికి చెందిన గుట్టపైకి తీసుకెళ్లి అక్కడ మరోసారి ఆమెను విపరీతంగా కొట్టారు. అయినా లక్ష్మణ్‌ను మరచిపోయేందుకు ససేమిరా అనడంతో తల్లి లక్ష్మితో ఫోన్‌లో మాట్లాడించారు. అప్పటికీ తన భర్తతోనే ఉంటానని అనురాధ తేల్చి చెప్పింది. అంతా విన్న లక్ష్మి.. అనురాధను చంపేయాలని వారికి చెప్పింది. దీంతో తండ్రి సత్యయ్య కూతురును గొంతునులిమి చంపేశాడు.

Share this on your social network: