మొదటి జీతం 10 వేలు... ఆస్తులు 110 కోట్లు

Published: Monday December 31, 2018
కారుణ్య నియామకం కోటాలో ఉద్యోగంలో చేరిన ఓ ప్రభుత్వ ఉద్యోగి కోట్లకు పడగలెత్తాడు. రూ.10వేలు మెదటి జీతంగా తీసుకొని పదేళ్లలోపే రూ.110కోట్ల ఆస్తులు కూడబెట్టాడు. అవినీతి సొమ్మును వెండి కంచాల్లో భోంచేస్తోన్న ఆయన ఇంట్లో సోదాలకు వెళ్లిన ఏసీబీ బృందాలు బీరువాల్లో లభించిన కొత్తనోట్ల కట్టలు చూసి ఆర్‌బీఐలో ఏదైనా గదిలోకి వచ్చామా అని అనుమానించే స్థాయికి అడ్డగోలుగా సంపాదించాడు. లక్ష్మీదేవి తన ఇంట్లోనే తాండవం చేయాలనుకున్న ఈ ఉద్యోగి ఆమెను మరింత ప్రసన్నం చేసుకోవడానికి బస్తాలతో చిల్లర కాయిన్లు తెచ్చి పూజకు ముహూర్తం కూడా ఖరారు చేశాడు. ఈలోపే ఏసీబీ అధికారులు దాడిచేయడంతో జైలు పాలయ్యాడు.
 
 
పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం తూర్పు విప్పర్రుకు చెందిన రాంపల్లి సత్యఫణి దత్తాత్రేయ దివాకర్‌(34) అవినీతి బాగోతం ఇది. దివాకర్‌ తండ్రి మరణించడంతో కారుణ్య నియామకంలో 2009 జూన్‌ 15న చింతలపూడిలోని ఆర్‌డబ్ల్యుఎస్‌ సబ్‌ డివిజన్‌ పంచాయతీరాజ్‌ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరాడు. తర్వాత ఏలూరు సూపరింటెండెంట్‌ ఇంజనీరింగ్‌ కార్యాలయంలో డిప్యుటేషన్‌పై వచ్చి 2017 అక్టోబరు వరకు పనిచేశాడు. అక్కడి నుంచి దీర్ఘకాలిక సెలవులోకి వెళ్లిపోయాడు. ఈ పనిచేసిన కాలంలోనే దివాకర్‌ అక్రమంగా ఆస్తులు సంపాదించినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. జిల్లాలోని పాలంగి, భీమోలు, వేల్పూరు, తణుకు, జంగారెడ్డిగూడెం, కంతేరులో అతని పేరిట, అతడి బంధువుల పేరిట ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో వీటికి సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.