వివస్త్రను చేసి రైలు పట్టాలపై నడక.. రాత్రంతా చిత్రవధ

Published: Tuesday February 05, 2019
 నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట రైల్వేస్టేషన్‌ అది. సమయం ఆదివారం రాత్రి 10.30 గంటలు.. రైల్వేస్టేషన్‌ చివరన ఓ ప్రేమ జంట మాట్లాడుకుంటోంది. ఎప్పటినుంచో వారిని గమనిస్తున్న ఐదుగురు యువకులు.. ఒక్కసారిగా ఆ ప్రేమజంటపై దాడి చేశారు. ప్రేమికుడిని రాళ్లతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. ఆ రాత్రంతా ఆమెకు నరకం చూపించారు. వివస్త్రను చేసి రైలు పట్టాలపై నడిపించారు. గాయపడిన ప్రియుడి అరుపులువిని పోలీసులు అక్కడకు రావడంతో పరారయ్యారు. పోలీసులు ఆ ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. విజయనగరం జిల్లాకు చెందిన యువతి(19), కాకినాడకు చెందిన యువకుడు(22) నెల్లూరు జిల్లా సరిహద్దుల్లోని శ్రీసిటీ సెజ్‌లో పని చేస్తున్నారు. ఇద్దరూ ప్రేమలోపడ్డారు. ఏకాంతంగా గడపడానికి ఆదివారం రాత్రి సూళ్లూరుపేట రైల్వేస్టేషన్‌లోని గూడ్స్‌షెడ్‌ వద్దకు వెళ్లారు. వారిని చూసిన ఐదుగురు యువకులు ఉన్మాదంతో దాడిచేశారు.
 
ప్రేమికుడ్ని తీవ్రంగా కొట్టి మాట వినకపోతే, అతడిని చంపేస్తామంటూ ప్రియురాలిని బెదిరించి, లొంగదీసుకున్నారు. ఒకడు ప్రియుడిని పట్టుకొగా, మిగతా నలుగురు ఆమెపై అత్యాచారం జరిపారు. ఇంతలో రాత్రి గస్తీ పోలీసు జీపు సైరన్‌ వినిపించింది. ఆ ప్రాంతంలో గస్తీ తిరుగుతున్న పోలీసులు ప్రేమికుడి ఏడుపు విని అతడి దగ్గరకు వచ్చారు. సూళ్లూరుపేట సీఐ కిషోర్‌బాబు, ఎస్‌ఐ విశ్వనాథ్‌రెడ్డి నేతృత్వంలో యువతి కోసం గాలించడం మొదలుపెట్టారు. తెల్లవారుజాము 3.30 గంటలకు యువతి ఉన్న ప్రాంతానికి పోలీసులు చేరుకోగానే ఆమెను వదిలేసి నిందితులు పారిపోవడానికి ప్రయత్నించారు. ఒకడు తప్పించుకోగా, మిగతా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.