మృతశిశువు అప్పగింతకు రూ.5వేలు డిమాండ్

వైద్య సిబ్బంది కర్కశంగా వ్యవహరించారు. మృతశిశువును అప్పగించేందుకు రూ.5వేలు డిమాండ్ చేశారు. లేకుంటే ఇచ్చేది లేదంటూ తెగేసి చెప్పారు. ఆ పేద దంపతులు కాళ్లావేళ్లా పడినా కనికరిం చలేదు. చివరకు రూ.3వేలు తీసుకుని మృతశిశువును అప్పగించారు. ప్యాపిలి ప్రభుత్వాసుపత్రిలో మూడురోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్యాపిలి పట్టణానికి చెందిన రాము అనే వ్యక్తి చికెన్‌సెంటర్‌లో దినసరి కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 20న భార్య అరుణకు పురిటినొప్పులు రావడంతో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాత్రి పది గంటల సమయంలో డ్యూటీలో ఉన్న సిబ్బంది కాన్పు చేశారు. శిశువు కాన్పు సమయంలో మృతిచెందింది. వివాహమైన మూడేళ్ల తర్వాత శిశువు పుట్టి మృతిచెందడంతో దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. తల్లి, మృతశిశువు తీసుకెళ్తామని సిబ్బందిని కోరారు. దీంతో సిబ్బంది రూ.5వేలు ఇచ్చి మృతశిశువును తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. తమ వద్ద రూపాయి కూడా లేదని వేడుకున్నా వారు కర్కశంగా వ్యవహరించారు. చివరకు రూ.3వేలకు బేరమాడారు. దీంతో రాము రాత్రి 11 గంటలకు పట్టణంలోకి తెలిసిన వాళ్ల వద్ద అప్పు తెచ్చి వైద్యసిబ్బంది చేతిలో పెడితే మృతశిశువును అప్పగించారు. ఈ ఘటన శుక్రవారం వెలుగుచూసింది.

Share this on your social network: