దాన్ని చూస్తూ హంతకులు రోజూ మద్యం తాగారు

Published: Thursday February 28, 2019
యువకుడి తల నరికి ఫ్రిజ్‌లో పెట్టి దాన్ని చూస్తూ హంతకులు రోజూ మద్యం తాగారు. పశ్చిమగోదావరి జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన కలకలం రేపింది. ఈ నెల 17న ఏలూరు సమీపంలో పోణంగి రోడ్డు తమ్మిలేరు కాల్వలో తలలేని మొండెం లభించిన కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఏలూరు నవాబుపేటకు చెందిన కంచి సతీష్‌(32) కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. సతీష్‌ నివాసం ఉంటున్న ప్రాంతంలోకి ఒక పచారి వ్యాపారి(30) తరచుగా వస్తుండటంతో, ఎందుకు వస్తున్నావంటూ సతీష్‌ గట్టిగా మందలించాడు.
 
ఆ వ్యాపారికి అప్పటికే ఆ ప్రాంతంలోని ఒక ఉద్యోగినితో వివాహేతర సంబంధం ఉంది. తనను మందలించడంతో, సతీ్‌షకూ ఆమెతో వివాహేతర సంబంధం ఉందని ఆ వ్యాపారి అనుమానించాడు. దీంతో సతీ్‌షను హత్య చేసేందుకు ప్రణాళిక సిద్ధంచేశాడు. తన షాపులో పని చేసే యువకుడిని సాయంగా పెట్టుకున్నాడు. వెంకటాపురం పంచాయతీలో ఒక అపార్టుమెంటులోని ఫ్లాట్‌ను ఆ వ్యాపారి గెస్ట్‌హౌ్‌సలా వినియోగించుకుంటున్నాడు.
 
సతీ్‌షను మద్యం తాగడానికి ఆ ఫ్లాట్‌కు ఆహ్వానించాడు. ఫుల్లుగా మద్యం తాగించి వ్యాపారి తన బైక్‌పై కూర్చోబెట్టుకుని షాపులో పనిచేసే యువకుడి సాయంతో అర్ధరాత్రి నేరుగా పోణంగి రోడ్డులో తమ్మిలేరు కాలువ గట్టుపైకి తీసుకెళ్లాడు. అక్కడ కత్తులతో పొడిచి హత్యచేశారు. తల నరికి మొండాన్ని అక్కడే పడేశారు. తలను మూటకట్టుకొని గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లి ఫ్రిజ్‌లో పెట్టారు. రోజూ ఆ తలను చూస్తూ మద్యం తాగినట్టు నిందితులు చెప్పడంతో పోలీసులే ఆశ్చర్యానికి గురైనట్టు తెలిసింది. తర్వాత భయంతో తలను ఆశ్రం సమీపంలోని కాలువలో పడేశామని తెలపడంతో ఏలూరు రూరల్‌ పోలీసులు మంగళవారం రాత్రి ఆ తలను స్వాధీనం చేసుకున్నారు. తలను పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. హంతకులిద్దరినీ పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నట్టు తెలిసింది.