ఫేస్‌బుక్ పరిచయం నేపథ్యంలో ఘటన
Published: Monday April 29, 2019

ఆ యువతితో అతడికి పరిచయంలేదు.. అతడి తమ్ముడికి మాత్రం ఫేస్‌బుక్‌లో పరిచయం.. ఆ పరిచయంలో ఏమైందో ఏమో.. ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ విషయం ఆ అమ్మాయికి తెలియదు!!.. కానీ తమ్ముడి ఆత్మహత్యతో అతడి అన్న ఆ యువతిపై కక్షగట్టాడు. ఆ ఊరెళ్లి.. తన తమ్ముడు రమ్మాన్నాడంటూ నమ్మించి.. ఊరి బయటికి తీసుకెళ్లి దారుణంగా నరికేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. దీనిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. భీమవరం మండలం కరుకువాడ బేతపూడి గ్రామానికి చెందిన పెనుమల మహిత(18) తల్లి ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లింది. తండ్రి ఓ ప్రైవేటు కళాశాలలో వ్యాన్ డ్రైవర్. మహిత కాజలోని మేనమామ ఇంట్లో ఉంటూ తూర్పు గోదావరి జిల్లా రాజోలులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఫేస్‌బుక్ ద్వారా కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన కురెళ్ల మహేశ్ సోదరుడితో పరిచయం ఏర్పడింది.
ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం మహిత అదృశ్యమైంది. దీనిపై మేనమామ యలమంచిలి పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈలోగా ఆమె మైలవరంలో ఉన్నట్లు తెలియడంతో స్థానిక పెద్దలతో అక్కడకు వెళ్లి ఆమెను తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో 15 రోజుల క్రితం మహితను ప్రేమించిన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కక్ష పెంచుకున్న అతని సోదరుడు కురెళ్ల మహేశ్ ఆదివారం మధ్యాహ్నం కాజ వెళ్లి మహితను కలిశాడు. ‘మా తమ్ముడు పాలకొల్లు వచ్చాడు.. నీకు దుస్తులు కొంటానన్నాడు’.. అని నమ్మబలికి గ్రామ శివారుకు తీసుకువచ్చి.. మాంసం నరికే కత్తితో ఆమె మెడపై అతి కిరాతకంగా నరికాడు. ఆమె చేయి అడ్డుపెట్టుకోగా చేతిపైనా నరికాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతి చెందింది.
మరోవైపు.. ప్రేమోన్మాదంతో (మహేశ్ మహితను ప్రేమించిన వ్యక్తిగా భావించి) హత్య చేశాడన్న ప్రచారం కూడా జరుగుతోంది. నిందితుడు పారిపోతుండగా స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. పోలీసులు మహేశ్‌ను పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నరసాపురం డీఎస్పీ కె.నాగేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆధార్‌కార్డు ప్రకారం మహేశ్ హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని శ్రీరామ్‌నగర్‌లో ఉంటున్నట్లుగా ఉందని, అతడి స్పృహలోకి వస్తేనే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.

Share this on your social network: