చీర మెడకు చుట్టుకుని బాలిక మృతి

ఊయలే ఉరితాడైంది.. ఓ చిన్నారి ప్రాణం తీసింది. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని రాజీవ్‌కాలనీలో సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. రాజీవ్ కాలనీకి చెందిన రాజు అనే వ్యక్తికి పిల్లలు లేరు. లక్ష్మీప్రసన్న (9) అనే బాలికను చిన్నతనంలోనే దత్తత తీసుకుని పెంచుకుంటున్నాడు. గత ఏడాది అనారోగ్యంతో రాజు చనిపోయాడు. అప్పటి నుంచి లక్ష్మీప్రసన్న సంరక్షణను రాజు సోదరి బుజ్జమ్మ చూస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం లక్ష్మీప్రసన్నతోపాటు, ఇంటి పక్కన పిల్లలంతా సమీపంలోని ఓ చెట్టు కిందకు చేరి కొద్దిసేపు ఆడుకున్నారు. వారంతా వెళ్లిపోయిన తర్వాత లక్ష్మీప్రసన్న చెట్టుకు చీరతో కట్టిన ఊయల ఎక్కి కూర్చింది. అందులో ఊగుతుండగా మెలికలు తిరిగి చీర మెడకు చుట్టుకుంది. అప్పటికి అక్కడ ఎవరూ లేదు. చాలాసేపటికి స్థానికులు గమనించి లక్ష్మీప్రసన్న ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బుజ్జమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Share this on your social network: