కళ్లల్లో కారం కొట్టిన కోడలు.. చావగొట్టిన కొడుకు

Published: Wednesday June 05, 2019

పున్నామ నరకం నుంచి తప్పించడమేమోగానీ.. బతికున్న తండ్రికి నరకం చూపించాడా కొడుకు. ఆస్తి కోసం నడివీధిలో వెంటపడి చావబాదాడు. కోడలు కూడా ఆయన కళ్లల్లో కారం చల్లుతూ వీరంగం చేసింది. ఈ అమానుష ఘటన మంగళవారం తిరుపతిలో చోటు చేసుకుంది. వెస్ట్‌ పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం.. తిరుపతి నగరం అనంతవీధిలో మునికృష్ణయ్య (80), కృష్ణవేణమ్మ దంపతులున్నారు. వీరికి విజయభాస్కర్‌, తులసీరామ్‌ కుమారులు. చాలా సంవత్సరాల కిందటే వీరు అప్పుచేసి ఇంటిని కట్టుకున్నారు. అందరూ కలిసి ఉండేవారు. అప్పుల విషయమై కొన్నాళ్లకు కుటుంబ తగాదాలు తలెత్తడంతో చిన్నకుమారుడు తులసీరామ్‌ వేరుకాపురం వెళ్లిపోయారు. ఆ తర్వాత కొన్నేళ్లు గడిచిపోయినా ఇంటికోసం చేసిన అప్పు తీరకపోవడంతో పెద్దకుమారుడు విజయ్‌భాస్కర్‌ తల్లిదండ్రులతో విబేధించి భార్య నీరజతో కలిసి వేరుకాపురం పెట్టాడు. తల్లిదండ్రుల పోషణనూ పట్టించుకోలేదు. ఈ క్రమంలో తులసీరామ్‌ తల్లిదండ్రుల పోషణ చూసుకుంటూ అప్పు తీరుస్తూ వచ్చారు. అప్పులు తీరిపోతున్నాయని తెలుసుకున్న పెద్దకుమారుడు, కోడలు తిరిగి తల్లిదండ్రుల పంచన చేరారు. తల్లి పేరిట ఉన్న ఇంటిని తమకు రాసివ్వాలని తల్లిదండ్రులను సతాయిచడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో నిత్యం గొడవలు జరిగేవి. కోడలు, ఆమె తమ్ముడు వంశీకృష్ణ కూడా వృద్ధ దంపతులతో గొడవపడేవాడు. ఈ క్రమంలో మంగళవారం తండ్రీ కొడుకులు, కోడలి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తండ్రిపై ఆగ్రహంతో విజయ్‌భాస్కర్‌ దాడికి పాల్పడ్డాడు. తప్పించుకుని రోడ్డుపైకి వచ్చినా వదలలేదు. కోడలు నీరజ మామ కళ్లల్లో, ఒంటిపై కారం చల్లగా.. కొడుకు దాడి చేశాడు. కని, పెంచిన తండ్రిపైనే భార్యతో కలిసి కొడుకు దాడికి పాల్పడటం స్థానికులను కదిలించి వేసింది. చట్టుపక్కలవారు కల్పించుకుని మునికృష్ణయ్యను రక్షించారు. వెస్ట్‌ పోలీసులకు సమాచారమిచ్చి.. బాధితుడిని రుయాస్పత్రికి తరలించారు.