అమ్మాయిని హోమ్‌కు, అబ్బాయిని ఇంటికి పంపిన పోలీసులు

Published: Thursday June 06, 2019
 యువజంట కులాంతర వివాహం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు ఎంత చెప్పినా అమ్మాయి తరపు వారు వినకపోవడం.. స్టేషన్‌ వద్దే గొడవకు దిగారు. దీంతో బుధవారం రాత్రి అమ్మాయిని హోమ్‌కు.. అబ్బాయిని ఇంటికి పంపించారు. దీనికి సంబంధించి ప్రేమజంట తెలిపిన వివరాల మేరకు.. బంగారుపాళ్యంకు చెందిన కుమార్‌ కుమారుడు ఉమామహేష్‌ (20), తిరుపతికి చెందిన కుదువ వ్యాపారి జేపీ ధర్మచంద్‌చౌదురి కుమార్తె మనీష (19) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వీరి ప్రేమ వ్యవహారం తెలిసి.. మనీషను తండ్రి ధర్మచంద్‌ తీవ్రంగా కొట్టి.. బెదిరించారు. ఈ క్రమంలో ఉమామహేష్‌, మనీష్‌ ఈనెల 3వ తేది ఇళ్లనుంచి వచ్చేశారు. చంద్రగిరి సమీపంలోని ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. కుమార్తె కనిపించకపోవడంతో ఆమె తండ్రి ఎంఆర్‌పల్లె పోలీస్‌ స్టేషన్‌లో కిడ్నాప్‌ కేసు పెట్టారు.
 
అదే సమయంలో, తాము ఇష్టపడి పెళ్లి చేసుకున్నామని, పెద్దల నుంచి రక్షణ కల్పించాలంటూ 4వ తేదీన ప్రేమజంట పలమనేరు డీఎస్పీని కోరింది. వారికి రక్షణ కల్పించాలని బంగారుపాళ్యం పోలీసులను డీఎస్పీ ఆదేశించి.. అక్కడికి పంపించారు. అయితే, అమ్మాయి తండ్రి ఫిర్యాదుపై ఉమామహేష్‌, మనీషను ఎంఆర్‌పల్లె పోలీసులు మంగళవారం అర్ధరాత్రి తీసుకొచ్చారు. ఆ తర్వాత హైడ్రామా నడుస్తోందని ప్రేమజంట, అబ్బాయి బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రొబేషనరీ ఎస్‌ఐ నరేంద్ర తమను భయపెడుతూ ఎవరి ఇళ్లకు వారు వెళ్లాలని చెబుతున్నాడని ప్రేమికులు తెలిపారు. దీనికి ఒప్పుకోకుంటే అబ్బాయిపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారని మనీష చెప్పారు. ఇక, అమ్మాయి తరపువారు బుధవారం మధ్యాహ్నం స్టేషన్‌ ఆవరణలోనే అబ్బాయి బంధువులతో గొడవకు దిగారు. స్టేషన్‌ నుంచి ఎలా వెళ్తారో చూస్తామంటూ బహిరంగంగానే బెదిరింపులకు దిగారు. దీంతో ఈ కేసును వెస్ట్‌ డీఎస్పీ వినోద్‌కుమార్‌ తన పరిధిలోకి తీసుకుని విచారించారు.
 
యువజంటకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. తాను ఇష్టపడి పెళ్లి చేసుకున్నానని, అతనే తనకు కావాలని మనీష చెప్పారు. అబ్బాయికి చట్టప్రకారం పెళ్లి వయసు 21 ఏళ్లు రావడానికి 9 నెలలు తక్కువగా ఉన్నప్పటికీ, అమ్మాయికి 18 ఏళ్లు పూర్తవడంతో ఇద్దరినీ బంగారుపాళ్యంకు పంపించాలని నిర్ణయించారు. సాయంత్రం 7 గంటల సమయంలో యువజంట స్టేషన్‌ నుంచి బయటకు రాగానే అమ్మాయి తల్లిదండ్రులు, సుమారు 30మంది కలిసి వీరిని అడ్డుకున్నారు. పోలీసులనూ తోసేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆ జంటను స్టేషన్‌లోకి తీసుకొచ్చారు.
 
డీఎస్పీ మళ్లీ స్టేషన్‌కు చేరుకుని ఇరువర్గాలతో చర్చించారు. అమ్మాయి తరపువారు ఎంతకూ వినకపోవడంతో మనీషను హోమ్‌కు, ఉమామహేష్‌ను ఇంటికి పంపాలని నిర్ణయించారు. కాగా, చట్టప్రకారమే పంపిస్తామని చెప్పిన పోలీసులు ఇప్పుడు అమ్మాయి తరపువారికి కొమ్ము కాస్తున్నారంటూ అబ్బాయి వర్గం ఆరోపిస్తోంది. రక్షణ కల్పించి ఇంటికి పంపించాల్సిందిపోయి హోమ్‌కు పంపడం సమజసం కాదని వారంటున్నారు.