వారం రోజులుగా బంధించి అత్యాచారం
Published: Sunday June 23, 2019

గుంటూరుకు చెందిన ఓ బాలిక ఒంగోలు కుర్రాడితో ప్రేమలో పడింది. తన ప్రియుడి కోసం ఒంగోలుకు వచ్చి అనుకోని పరిస్థితిల్లో కొందరు కామాంధులబారిన పడింది. వారు ఆమెను గదిలో బంధించి వారంపాటు అత్యాచారం చేశారు. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. ఒంగోలుకు చెందిన కారు డ్రైవర్ అమ్మిశెట్టి రాము తన వాహనంలో ఇరవై రోజుల క్రితం ఓ రోగిని గుంటూరు వైద్యశాలకు తీసుకెళ్లాడు. అదే సమయంలో తన అమ్మమ్మకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో గుంటూరుకు చెందిన ఓ బాలిక (16) ఆస్పత్రికి వచ్చింది.
అక్కడ పరిచయం ఏర్పడి.. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తర్వాత కొద్ది రోజుల పాటు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో రాము కోసం ఈ నెల 16న ఆ బాలిక ఒంగోలు వచ్చేసింది. అయితే అతడి జాడ తెలియకపోవడంతో ఆర్టీసీ ఆవరణలోని ఓ సెల్‌షాపులో పనిచేసే కుర్రాడిని ఆశ్రయించి రాముకు ఫోన్ చేయాలని కోరింది.ఆ బాలికపై కన్నేసిన సెల్‌షాపులో పనిచేసే బాజి (దివ్యాంగుడు) ఆమెతో నమ్మకంగా మాట్లాడాడు. రాము కనిపించే వరకు ఇక్కడే ఉండొచ్చని షాపులో ఆశ్రయం కల్పించాడు. అదేరోజు రాత్రి బాలిక నిద్రిస్తున్న సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగని బాజి మరుసటి రోజు ఆమెను బెదిరించి సుందరయ్యభవన్ రోడ్డులోని తన రూముకు తీసుకెళ్లి అక్కడ ఉంచాడు. అనంతరం ఒంగోలులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులను పిలిపించాడు. బాజితోపాటు వారు కూడా వారంరోజుల పాటు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.
కాగా శనివారం సాయంత్రం ఆ బాలిక ఆర్టీసీ డిపోలో రామును వెతుకులాడే ప్రయత్నంలో ఉండగా.. ఔట్‌పోస్టు పోలీసులు చూసి ఆమెను ప్రశ్నించారు. దీంతో జరిగిన ఘోరాన్ని వివరించి బోరుమంది. రంగంలోకి దిగిన వన్‌టౌన్ పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇద్దరు పరారీలో ఉన్నారు. ఒంగోలు వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో గ్యాంగ్‌రేప్ గా కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ రాధేష్ మురళీ తెలిపారు.

Share this on your social network: