పశ్చిమలో వెలుగుచూసిన దురాగతాలు
Published: Monday July 08, 2019

తాగిన మైకంలో కన్నూమిన్నూ కానక.. 12 ఏళ్ల కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. మరో ఘటనలో 13 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ దురాఘతాలు పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగుచూశాయి. పోలీసుల కథనం ప్రకారం.. బుట్టాయగూడెం అరుంధతిపేటకు చెందిన ఓ వ్యక్తి నిత్యం మద్యం సేవించి ఇంటికి వస్తుండటంతో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇలా భర్తతో గొడవ పడినపుడల్లా భార్య దూరప్రాంతంలో ఉన్న పుట్టింటికి వెళ్లేది. ఒక్కోసారి తమ కుమార్తెను తండ్రి వద్దనే వదిలి పెట్టేది. దీనిని అవకాశంగా తీసుకున్న ఆ ప్రబుద్ధుడు మద్యం సేవించి వచ్చి కూతురిపై అత్యాచారం చేసేవాడు. ఈ క్రమంలో కొద్దిరోజులుగా ఆ చిన్నారి(12) అనారోగ్యంగా ఉండటంతో ఆమె తల్లి శనివారం ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ వైద్యులు పరీక్షించి, ఆ బాలిక గర్భవతి అని తేల్చారు.
దీంతో ఆమె.. తన భర్తపైనే అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. డీఎస్పీ రవికుమార్, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ నాగరాజు గ్రామానికి వెళ్లి విచారణ చేశారు. కేసు నమోదు చేసి, బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కాకినాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇక, పోలవరం మండలం గూటాల పంచాయతీ కొత్తపట్టిసీమ గ్రామానికి చెందిన వీరప్పరాజు శివయ్య(60) అనే వృద్ధుడు అదే గ్రామానికి చెందిన బాలిక(13)పై ఆదివారం అత్యాచార యత్నానికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో స్థానిక యువకులు వచ్చి ఆమెను కాపాడి, నిందితుడిని పోలీసులకు అప్పగించారు. దీంతో అతడిపై పోక్సో కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ ఆర్.శ్రీను తెలిపారు. కాగా, బాధిత బాలిక తండ్రి 20 రోజల క్రితం చనిపోవడంతో ఆ కుటుంబం వీధిన పడిందని గ్రామస్తులు తెలిపారు.

Share this on your social network: