దొంగ నోట్ల కట్టలు

Published: Thursday July 25, 2019

 అతను ఇంజనీరింగ్‌ చదివాడు. తనలాగే డిప్లమో చదువుకుని ఊళ్లో ఖాళీగా తిరుగుతున్న మరో యువకుడితో జతకట్టాడు. తిమిళనాడులోని కృష్ణగిరి జిల్లా కె.నగర్‌కు చెందిన మణిగండన్‌ (28), ఎం.సురేశ్‌కుమార్‌(23) అనే వీరిద్దరూ సరిహద్దునే ఉన్న చిత్తూరు జిల్లా కుప్పం మండలం సామగుట్టపల్లె చేరుకుని అక్కడే ప్రింటింగ్‌ ప్రెస్‌ పెట్టేశారు. అదేదో అక్షరాలు ముద్రించే మిషన్‌ కాదు.. కరెన్సీ కట్టలు ముద్రించే యంత్రం. సామగుట్టపల్లెకె చెందిన అనంతకుమార్‌(33), తిరుపతి విద్యానగర్‌కు చెందిన దేవిరెడ్డి సురేశ్‌ రెడ్డి(31), తిరుపతికి చెందిన హేమంత్‌(26), కృష్ణగిరి జిల్లా ఎల్తిగిరికి చెందిన కె.కుబేంద్రన్‌(50)తో కలిసి దొంగ నోట్లు ముద్రించి, చలామణి చేసేవారు. గుట్టుగా సాగుతున్న వీరి వ్యవహారాన్ని పోలీసులు పసిగట్టేశారు. అరెస్టు చేసి వారి నుంచి రూ.2,76,22,000 విలువైన దొంగనోట్లు, మూడు ల్యాప్‌ట్యాపులు, రెండు ప్రింటర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన కుప్పం సీఐ ఆర్‌.కృష్ణమోహన్‌, రామకుప్పం ఎస్‌ఐ ప్రసాదరావు తదితరులకు ఎస్పీ అప్పలనాయుడు రివార్డులిచ్చి అభినందించారు.