మీరు లక్షలు సంపాదిస్తుంటే మేం చూస్తూ ఊరుకోవాలా?

Published: Saturday August 03, 2019
అంగన్‌వాడీ కార్యకర్తలు, చిరుద్యోగులను బెదిరిస్తున్న వైసీపీ నేతలు ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. ప్రపంచ ప్రఖ్యాత కియా ఫ్యాక్టరీ జనరల్‌ మేనేజర్‌నే బెదిరించే స్థితికి ఎదిగారు. ‘ఇప్పుడు మా పార్టీ అధికారంలో ఉంది. మేం చెప్పినట్లే చేయాలి. మా వాళ్లను ఉద్యోగాల్లోకి తీసుకోవాలి. అంతేకాదు.. మా లారీలనే మీరు అద్దెకు తీసుకోవాలి. మీరేమో రూ.లక్షలు లక్షలు సంపాదిస్తుంటే మేం చూస్తూ ఊరుకోవాలా..? అదేం కుదరదు. మేం చెప్పింది వినాల్సిందే. చెయ్యాల్సిందే’ అని ఇద్దరు వైసీపీ నాయకులు కియ కార్ల పరిశ్రమ జీఎం సదాశివంను బెదిరించారు. చెన్నేకొత్తపల్లిలో మూడు రోజుల కింద జరిగిన ఈ సంఘటనపై జీఎం జిల్లా ఎస్పీ సత్యఏసుబాబును ఆశ్రయించారు. తమిళనాడుకు చెందిన సదాశివం కియ మోటార్స్‌లో జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఈయన చెన్నేకొత్తపల్లిలో అద్దె ఇంటిలో నివాసముంటూ విధులు నిర్వర్తిస్తున్నారు.
 
వైసీపీ మండల కన్వీనర్‌ మైలారపు గోవిందరెడ్డి, బసంపల్లి మాజీ సర్పంచు డోలా రామచంద్రరెడ్డి ఆ ఇంటికి వెళ్లి ఉద్యోగాల విషయమై ఆయనకు హుకుం జారీ చేశారు. ఆ అధికారి ఒక్కసారిగా బిత్తరపోయి దిక్కుతోచని పరిస్థితుల్లో పరిశీలిస్తామని వారికి నచ్చజెప్పి పంపించారు. అనంతరం ఈ బెదిరింపుల వ్యవహారంపై ఎస్పీకి జీఎం ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో ధర్మవరం డీఎస్పీ రమాకాంత్‌ రంగంలోకి దిగి ఆ ఇద్దరి నాయకుల అరెస్టుకు ఆదేశాలిచ్చారు. దీంతో ఎస్‌ఐ రమేశ్‌బాబు వెంటనే డోలా రామచంద్రారెడ్డిని అదుపులోకి తీసుకుని డీఎస్పీ ముందు హాజరుపరిచారు. ఆయన రామచంద్రారెడ్డికి తీవ్ర స్థాయిలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. గోవిందరెడ్డి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరిపై సీకేపల్లి పోలీసు స్టేషన్‌లో 506 సెక్షన్‌ కింద బెదిరింపులకు పాల్పడిన కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. కొత్త రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలను కాపాడుకోవాల్సింది పోయి ఇలాంటి బెదిరింపులకు దిగడం వల్ల వల్ల నిరుద్యోగుల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.