వందలమంది ప్రాణాలను పణంగా పెట్టాడు’

Published: Sunday August 11, 2019

డబ్బులు సంపాదించేందుకు వందలమంది ప్రాణాలను పణంగా పెట్టాడు. రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్ పెట్టి వీడియో తీశాడు. సిలిండర్ ట్రాక్ పైనుంచి పక్కకు పడిపోవడంతో పెను ముప్పు తప్పింది. చిత్తూరు జిల్లా రాజగున్నేరి, ఎర్పేడు మధ్యలో రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్ పెట్టి వీడియో తీశాడు. సిలిండర్ పట్టాలపై నుంచి ఎగిరి పక్కకుపడింది. ఈ వీడియోను యూ ట్యూబ్‌లో పెట్టాడు. ఈ వీడియో ప్రజల్లో కలకలం రేపింది. సోషల్ మీడియాలో వైరల్ అయి.. పోలీసులు దృష్టికి వెళ్లింది. కొంగర రామిరెడ్డి అనే వ్యక్తి గత కొంత కాలంగా డేంజర్ స్టంట్ వీడియోలు తీస్తూ యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నాడు. వ్యూస్ పెరగాలనే ఆశతో పైశాచిక పనులు చేస్తున్నాడు. ఇంతకు ముందు కూడా పట్టాలపై వస్తువులు పెట్టి స్టంట్లు చేశాడని, గతంలో పట్టాలపై బైక్ పెట్టాడని పోలీసులు తెలిపారు. ఎట్టకేలకు పోలీసులు యువకుడిని పట్టుకున్నారు.