భార్య తల నరికిన భర్త.. పోలీసులకు లొంగుబాటు

Published: Monday August 12, 2019
 ప్రేమిస్తున్నానని వెంటపడి మరీ పెళ్లి చేసుకున్నాడు. మూడేళ్లు బాగానే సాగిన కాపురంలో కలహాలు మొదలయ్యాయి. విడాకుల దాకా వెళ్లాయి. భార్య విడాకులకు ససేమిరా అనడం తో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఇంటి బయట మాటు వేసి వేటు వేశాడు. నడిరోడ్డుపై పట్టపగలు భా ర్య తల నరికేసి కాలవలో పడేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన విజయవాడ సత్యనారాయణపురం శ్రీనగర్‌కాలనీలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. పోలీసుల కథనం మేరకు. కృష్ణా జిల్లా శ్రీకాకుళం గ్రామానికి చెందిన పేటేటి ప్రదీ్‌పకుమార్‌ విజయవాడలోని టీఎ్‌సఆర్‌ కంపెనీలో పనిచేసేవాడు. సత్యనారాయణపురం శ్రీనగర్‌ కాలనీకి చెందిన మణిక్రాంతి కూడా అదే కంపెనీలో పనిచేసేది. ప్రదీప్‌ ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కులాలు వేరైనా ఆమెనే పెళ్లి చేసుకుంటానని ప్రదీప్‌ పోలీసులకు చెప్పాడు. మణిక్రాంతి కుటుంబ సభ్యులను కూడా ఒప్పించి 2015లో పెళ్లి చేసుకున్నాడు.
 
మూడేళ్లు బాగానే సాగిన వారి కాపురంలో గొడవలు మొదలయ్యాయి. విజయవాడలో ఉండే ప్రదీప్‌ సోదరి వద్దకు వెళ్లొద్దని మణిక్రాంతి హెచ్చరించేది. అది నచ్చని ప్రదీప్‌ భార్యను దూరం పెడుతూ వచ్చాడు. కొన్నాళ్లకు తనకు విడాకులు కావాలని కోర్టు నోటీసులు కూడా పంపాడు. దీనికి సంబంధించిన కేసు కోర్టులో నడుస్తోంది. గతేడాది ప్రదీప్‌ కుమార్‌, అతని సోదరి కలిసి మణిక్రాంతిపై దాడి చేశారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతోపాటు మరికొన్ని కేసుల్లో కోర్టుకు హాజరు కానందుకు ప్రదీ్‌పకు న్యాయమూర్తి అరెస్టు వారెంట్‌ జారీ చేశారు. కొద్దిరోజుల క్రితం అతన్ని పోలీసులు అరెస్టు చేసి, జైలుకు పంపారు. రెండు రోజుల క్రితమే ప్రదీప్‌ జైలు నుంచి విడుదలయ్యాడు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్‌కు వెళ్లిన మణిక్రాంతి 2 గంటలకు ఇంటికి వచ్చింది. అక్కడే మాటువేసిన ప్రదీప్‌ ఆమెపైకి దూకి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లాడు. వెంట తెచ్చుకున్న కత్తితో తల నరికేశాడు. అనంతరం ఆ తలని ఏలూరు కాలవలో పడేసి పోలీసులకు లొంగిపోయాడు.