అర్ధరాత్రి లేడీస్‌ హాస్టల్లోకి దుండగుడు..

Published: Friday August 16, 2019
బాధితురాలు.. ఓయూ ఇంజనీరింగ్‌ కాలేజీలో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని. హాస్టల్లోని ఫస్ట్‌ఫ్లోర్‌లో ఉంటోంది. పోలీసులు, అధికారులు, విద్యార్థుల వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 3:10 గంటలకు నిద్రలేచిన బాధితురాలు వాష్‌రూమ్‌కు వెళ్లింది. అదే సమయంలో హాస్టల్‌ వెనుకవైపు ఉన్న గోడను దూకి దుండగుడు లోపలికి వచ్చాడు. బాత్‌రూంలోకి ఆమె వెళ్లడం చూసి బయట నుంచి గడియపెట్టాడు. కొద్దిసేపటికి లోపలి నుంచి డోర్‌ను ఆమె తెరించేందుకు ప్రయత్నించగా రాలేదు.
 
 
ఆందోళన చెందిన ఆమె.. డోర్‌ను గట్టిగా కొట్టడంతో దుండగుడు.. బాత్‌రూం గోడపైకి ఎక్కాడు. అరిస్తే చంపేస్తానంటూ ఆమెను కత్తితో బెదిరించాడు. తర్వాత బాత్‌రూమ్‌ లోపలకు వంగి డోర్‌ గడియతీసి ఆమెను బయటకు లాక్కొచ్చాడు. బాధితురాలి అరుపులకు నిద్రిస్తున్న అమ్మాయిలు లేవడంతో వారి గదులకు బయట నుంచి గడియ పెట్టాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడం.. గదుల్లోని అమ్మాయిలు కూడా పెద్దగా అరవడంతో దుండగుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
 
 
వెళ్తూ వెళ్తూ బాధితురాలి నుంచి సెల్‌ఫోన్‌ను లాక్కున్నాడు. కింద పార్క్‌చేసి ఉన్న ఓ బైక్‌ సీటును కత్తితో కోసి.. గోడదూకి పారిపోయాడు. బాధితురాలి ఫోన్‌ పగిలిపోయిన స్థితిలో ఆ గోడ వద్ద లభ్యమైంది. గురువారం ఉదయం బాధితురాలి నుంచి పోలీసులు పూర్తి వివరాలను సేకరించారు. తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ఘటనపై క్లూస్‌ టీం, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.