‘ఈ బిజ్’ పేరుతో మల్టీలెవల్ మోసం
Published: Wednesday August 21, 2019

విద్యార్థులు, నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని మల్టీలెవల్ మోసానికి పాల్పడి, దేశవ్యాప్తంగా 17 లక్షల మంది అమాయకులను మోసం చేసి, రూ. 5 వేల కోట్లు కొల్లగొట్టిన ఘరానా కేటుగాళ్ల ఆటకట్టించారు సైబరాబాద్ పోలీసులు. ఈ ఏడాది మార్చి 12న ఈ మోసం వెలుగులోకి వచ్చింది. భారీ స్కామ్‌ను నిందితుడు తన భార్య, కొడుకు సహాయంతో చేయడం గమనార్హం. అతడి భార్య పోలీసులకు గతంలో పట్టుబడింది. పరారీలో ఉన్న తండ్రీకొడుకులను సైబరాబాద్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి బ్యాంకుల్లో నిల్వ ఉంచిన డబ్బు సహా మొత్తం రూ. 389 కోట్లు ఫ్రీజ్ చేశారు. విలేకరుల సమావేశంలో సీపీ సజ్జనార్ వివరాలు వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా సెక్టార్ 63 కేంద్రంగా ఈ బిజ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్‌ను పవన్ మల్హాన్ అనే వ్యక్తి మేనేజింగ్ డైరెక్టర్‌గా, అతడి భార్య అనితా మల్హాన్ డైరెక్టర్‌గా 2001లో ఏర్పాటు చేశాడు. వారి కుమారుడు హితిక్ మల్హాన్ కంపెనీ వ్యవహారాలు చూస్తుంటాడు. సుమారు 18 ఏళ్ల నుంచి సాగుతున్న ఈ దందాలో పిరమిడ్ స్కీమ్‌ను అమలు చేశారు. వారి కంపెనీలో చేరిన ఒక సభ్యుడు ఎడమ, కుడి అన్నట్లుగా మరో ఇద్దరిని చేర్పించాలి. చేరిన వారు మరో ఇద్దరిని, లేదా ముగ్గురిని చేర్పిస్తూ వెళ్లాలి. ప్రతి సభ్యుడు రూ. 16,821 చెల్లించి తన కింద మరో ఇద్దరు ముగ్గురు సభ్యులను చేర్పించాలి.
చెల్లించిన నగదుకు ఏదో ఒక వస్తువును మార్కెటింగ్ చేసినట్లు ఉండాలనే ఉద్దేశంతో వస్త్రాలు (కట్‌పీస్)తోపాటు ఎలకా్ట్రనిక్ లెర్నింగ్ పేరిట ఆన్‌లైన్ కోర్సుల నిమిత్తం లాగిన్ ఐడీ పాస్‌వర్డ్ ఇస్తారు. వస్తువుల మార్కెటింగ్ ముసుగులో ఎంల్‌ఎం స్కీమ్‌లను నిర్వహించి 17 లక్షల మందిని మోసం చేశారు. ఈ క్రమంలో రూ. 5 వేల కోట్లు కొల్లగొట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇలాంటి స్కీమ్‌లలో చేరిన వారిలో అతి తక్కువ మందికి మాత్రమే కొద్దో గొప్పో ఆదాయం వచ్చినప్పటికీ 95 శాతం మంది దారుణంగా దగా పడ్డారని సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఈ లెర్నింగ్ పేరిట ఆన్‌లైన్ కోర్సులు.. హాలిడే ప్యాకేజీలు, టెక్స్‌టైల్స్, రకరకాల వస్తువులు మార్కెటింగ్ అంటూ ఆన్‌లైన్‌లో ఆకర్షణీయమై ప్రకటనలతో అమాయకులను నమ్మించసాగారు.
అరచేతిలో వైకుంఠం...
21వ శతాబ్దపు వ్యాపారమంటూ.. పేదవాడిగా పుట్టడం తప్పు కాదు... కానీ చావడం పెద్ద నేరమని వారిని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి అరచేతిలో వైకుంఠం చూపించారు. కళ్లముందు కోటీశ్వరులు అయినట్లు కలల ప్రపంచాన్ని చూపించారు. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదన అంటూ బురిడీ కొట్టించారు. ప్రమోటర్‌గా చేరిన వారు కొత్త వారిని నియమించగానే రిప్రజెంటేటివ్‌గా మారిపోతాడు. అతను మరో ఇద్దరిని చేర్పిస్తాడు. ఇలా చెయిన్ పెరుగుతూ పోతే లక్షలు, కోట్ల రూపాయలు వస్తాయని కళ్లముందే కోటీశ్వరులు అయినంత బిల్డప్ ఇచ్చారు. ఒకరు కంపెనీలో చేరి డబ్బులు చెల్లించగానే అతడికి పదివేల పాయింట్లు వస్తాయి.
మరో ముగ్గురిని అతడు చేర్పించగానే లెగ్‌లు పెరిగి పాయింట్ల సంఖ్య 30 వేలకు చేరుతుంది. ఆ తర్వాత అతడికి కమీషన్ రూపంలో రూ. 2,700 వస్తుంది. ఈ క్రమంలో మెంబర్లు పెరిగే కొద్దీ ఆదాయం పెరుగుతుంది. దానిద్వారా వారు ఇచ్చే కమీషన్ కూడా పెరుగుతుంది. ఇలా దాని విలువ లక్షల రూపాయల్లో ఉంటుందని నమ్మించి ముగ్గులోకి దించుతారు. ఎక్కువ మందిని చేర్పించిన వారికి సిల్వర్, డైమండ్, డిప్లొమాట్, సిల్వర్ డిప్లొమాట్, గోల్డ్ డిప్లొమాట్, డైమండ్ డిప్లొమాట్, అంబాసిడర్, సిల్వర్ అంబాసిడర్, గోల్డ్ అంబాసిడర్, డైమండ్ అంబాసిడర్, చైర్మన్ సర్కిల్ అనే స్థాయిలను చూపించి ఊహా లోకంలో విహరింపచేస్తారు. ఇలా దేశవ్యాప్తంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, జమ్మూ కశ్మీర్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గోవా తదితర ప్రధాన నగరాల్లో మల్టీలెవల్ మోసాలకు పాల్పడినట్లు సీపీ వెల్లడించారు.

Share this on your social network: