అవమానం భరించలేక ... తల్లి, తండ్రి, కొడుకు ఆత్మహత్య

Published: Friday August 23, 2019
అందరితో కలిసిమెలిసి ప్రశాంత జీవితాన్ని సాగించే వారి జీవితాల్లో కొడుకు వివాహం ఆరని చిచ్చును రేపింది. వివాహమై సంవత్సర కాలం తిరగకుండానే కొడుకు కోడలికి విభేదాలు రావడంతో ఇంటిలో వివాదాలు మొదలయ్యాయి. చిన్నమాట అంటేనే తట్టుకోలేని వ్యక్తులు కోడలిని కాపురానికి తీసుకువచ్చేందుకు చేసిన పంచాయితీలో ఏమిజరిగిందో తెలియదు కాని మూడు నిండు ప్రాణాలు బలయ్యాయి. కైకలూరు మండలం తామరకొల్లుశివారు అయోధ్యపట్నం గ్రామానికి చెందిన వెలగల బలరామకృష్ణారెడ్డి(60),అతని భార్య సుబ్బలక్ష్మి(51), కుమారుడు గంగాధర్‌రెడ్డి(30) ఆత్మహత్య చేసుకున్నారు. ఎవరినోట విన్నా మంచి మనుషులు అనేపేరు తప్ప చెడుగా మాట వరుసగా కూడా చెప్పుకోనటువంటి కుటుంబం. పశువుల కాపరికి ఇవ్వాల్సి రెండు వందలు సైతం సూసైడ్‌ నోట్‌లో రాయడంతోపాటు ఇంటిలో మృతిచెందితే ఇంటికి అరిష్టమని తనకూతుళ్లకు కష్టం కలుగకూడదనే భావనతో ఇంటి వెనుకవైపు వరండాలో ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ స్ధానికులు కంటితడిపెట్టారు.
 
కైకలూరు మండలం తామరకొల్లుశివారు అయోధ్యపట్నం గ్రామానికి చెందిన వెలగల బలరామకృష్ణారెడ్డి(60),అతని భార్య సుబ్బలక్ష్మి(51), కుమారుడు గంగాధర్‌రెడ్డి(30) ఆత్మహత్య చేసుకున్నారు. బలరామకృష్ణారెడ్డికి ఇద్దరుకుమార్తెలు మాధవి, మాలతి, కుమారుడు గంగాధర్‌రెడ్డి సంతానం. ఇద్దరు కుమార్తెలకు పెళ్ళిళ్లుచేసి అత్తవారింటికి పంపించారు.కుమారుడు గంగాధర్‌ రెడ్డి సింగపూర్‌లో ఉద్యోగం చేసుకుంటూ ఉన్నతస్ధితికి చేరుకున్నాడు. గతసంవత్సరం ఆగష్టు31వతేదీన పశ్చిమగోదావరిజిల్లా పెనుగొండమండలం వలేటిపాడు గ్రామానికి చెందిన రాజేశ్వరి ఇచ్చి వివాహం చేశారు.వివాహం జరిగిన కొద్దిరోజులకే కొడుకు,కోడలకుమధ్య కలహాలు ప్రారంభమయ్యాయి. గొడవలు జరుగుతున్నప్పటికీ విదేశాల్లో ఉద్యోగానికి సెలవులు అయిపోయాయని గంగాధర్‌రెడ్డి వెళ్ళాడు. ఈనెల 31వతేదీన పెళ్ళిరోజును పురస్కరించుకుని పదిరోజులక్రితం స్వగ్రామానికి వచ్చాడు.
 
ఈనెల21న అత్తవారి ఊరైన వలేటిపాడు తల్లిదండ్రులతో కలిసి భార్యనుకాపురానికి తీసుకువచ్చేందుకు వెళ్ళారు. అక్కడ పెద్దల సమక్షంలో ఏ వివాదం జరిగిందో తెలియదు కాని బల రామకృష్ణారెడ్డి సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. గురువారం ఉదయం బలరామకృష్ణారెడ్డి కొడుకుతో కలిసి కైకలూరు వెళ్ళి కొన్ని పనులను ముగించుకున్నారు. పురుగుమందు డబ్బా,రెండు కొత్త నేలచాపలను కొనుగోలు చేసుకున్నారు. మధ్యాహ్న సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.