సుఫారీ ఇచ్చి భార్యను హత్య చేయించిన భర్త..

Published: Saturday August 24, 2019
భార్య చెడు మార్గంలో పయనించటాన్ని గుర్తించిన  భర్త మందలించాడు. పెద్ద మనుషులతో చెప్పించినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో ఆగ్రహించిన ఆ భర్త బందువులకు రూ. పది వేల సుఫారి ఇచ్చి ఆమెను హత్య చేయించాడు. ఇదీ హవేళిఘణాపూర్‌ మండలం ఔరంగాబాద్‌ తాండాకు చెందిన 26 యేళ్ల వివాహిత అత్యాచారం, హత్య వెనుక ఉన్న మిస్టరీ. ఈ హత్య కేసును మెదక్‌ రూరల్‌ పోలీసులు నాలుగు రోజుల్లోనే ఛేదించారు. వివాహిత హత్య కేసు వివరాలను శుక్రవారం మెదక్‌ డీఎస్పీ కృష్ణమూర్తి మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.... హవేళిఘణాపూర్‌ మండలం ఔరంగాబాద్‌ తండా పంచాయతీకి చెందిన 26 యేళ్ల వివాహిత ఈనెల 17న హత్యకు గురయింది.
 
భర్త ఫిర్యాదు మేరకు రూరల్‌ సీఐ రాజశేఖర్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. కేసును వివాహేతర సంబంధాల కోణంలో విచారించిన పోలీసులు భార్యాభర్తల మధ్య గతంలో జరిగిన గొడవలపై దృష్టిపెట్టారు. మృతురాలి భర్త బతుకుదెరువు కోసం సింగపూర్‌కు ఏడాది క్రితం వెళ్లాడు. ఆ సమయంలో ఆమె ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం నెరిపింది. భర్త ఆరుమాసాల్లోపు తిరిగి వచ్చి ఓ ఇటుక బట్టి ట్రాక్టర్‌లో కూలీగా చేరాడు. ఆ క్రమంలో భార్య ప్రవర్తలో మార్పును గమనించాడు. తాండాలోని కుల పెద్దల పంచాయతీ పెట్టి మందలించారు. అయినా ఆమెలో మార్పు రాలేదు.
 
ప్రియుడితో కలిసి తనను  భార్య ఎక్కడ అంతమొందిస్తోందన్న భయం అతన్ని వెంటాడింది. ఎలాగైనా ఆమెను హత్య చేయాలన్న నిర్ణయానికి వచ్చాడు. ఈ క్రమంలో ట్రాక్టర్‌ నడిపే ముడావత్‌ రూప్‌ సింగ్‌ సాయాన్ని కోరాడు. తన భార్యను హత్య చేయాలని కోరాడు. హత్యకు మొదట సముఖంగా లేని రూప్‌సింగ్‌... రూ. పది వేలు ఇస్తాననటంతో అంగీకరించాడు. హత్యకు పథకం వేసి రూప్‌సింగ్‌...తన తోడల్లుడు ముడావత్‌ మదన్‌ సహకారం తీసుకున్నాడు. ఈనెల 17న మృతురాలిని పథకం ప్రకారం రూప్‌సింగ్‌, మదన్‌ మృతురాలిని బైక్‌పై ఎక్కించుకొని జిల్లా కేంద్రంలోని ఓ సినిమా ధియేటర్‌లో ఫస్ట్‌ షో సినిమాను చూశారు. అనంతరం ఓ వైన్‌ షాపులో మద్యం కొనుగోలు చేసి అవుసులపల్లి గ్రామ శివారులోని ఓ చెట్టు కిందకు వెళ్లారు. పథకం ప్రకారం వచ్చిన రూప్‌ సింగ్‌, మదన్‌ తమ వెంట తెచ్చుకున్న మద్యాన్ని ఆమెకు తాగించారు.
 
మత్తులోకి జారుకున్న తర్వాత ఇద్దరు కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం ఆమె చీరతోనే ఉరి వేసి హత్య చేశారు. భర్త... సినిమాకు వెళ్లిన దగ్గర నుంచి పథకం అమలవుతున్న తీరులో ప్రతీ విషయాన్ని ఫోన్‌ ద్వారా తెలుసుకుంటునే ఉన్నాడు. హత్యకు ముందు ఫోన్‌ చేసి చంపారా.? లేదా..? అని అడిగాడు. మరో పదిహేను నిమిషాల్లో చంపేస్తున్నాం అని వారు చెప్పారు. హత్య చేశాక దగ్గర్లోని చౌరస్తా వద్ద ముగ్గురు కలుసుకొని ఇంటికి వెళ్లిపోయారు.
 
తన భార్య ఇంటికి రావటంలేదని చుట్టు పక్కల వారిని భర్త నమ్మించే ప్రయత్నం చేశాడు. మరుసటి రోజు ఉదయం హత్య విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి సమాచారాన్ని సేకరించిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఇందులో ప్రధాన పాత్ర భర్త వహించినా హత్య చేసింది మాత్రం రూప్‌సింగ్‌, మదన్‌ మాత్రమే.. ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ సమావేశంలో సీఐ రాజశేఖర్‌, మెదక్‌ రూరల్‌, హవేళిఘణాపూర్‌ ఎస్‌ఐలు లింబాద్రి, శ్రీకాంత్‌, తాహేర్‌ తదితరులు పాల్గొన్నారు.