ముగ్గురిని చంపిన సైకో కిల్లర్...
Published: Saturday August 24, 2019

ఒంటరిగా ఉన్న మహిళలే అతడి టార్గెట్!.. అర్ధరాత్రి నిద్రిస్తున్న వారి తలపై బండరాయితో మోది చంపేస్తాడు. ఆపై అత్యాచారం చేసి ఒంటిపై బంగారు ఆభరణాలను దోచుకెళతాడు. అలాగే ఎవరైనా డబ్బులిస్తే హత్యలు చేయడానికీ, దోపిడీలకు వెనకాడడు. ఇలా ఇప్పటివరకు ముగ్గురి ఉసురుతీశాడు. ఈ కేసుకు సంబంధించి చిత్తూరు ఎస్పీ వెంకట అప్పల నాయుడు శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం.. నగరి మండలం ఎంఎన్ కండ్రిగకు చెందిన సరోజమ్మ, గోపాలరెడ్డి భార్యాభర్తలు. పందుల వ్యాపారం చేసేవాడు. భార్యతో విభేదాల కారణంగా ఆమె కొన్నాళ్లుగా వేరుగా ఉంటోంది. ఆమెను చంపేయాలని నిర్ణయించుకుని.. కిరాయి హంతకుడైన తమిళనాడు వేలూరు జిల్లా అరక్కోణం టౌన్‌కు చెందిన ఆర్.ఆనంద్‌తో రూ.30 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆనంద్ రూ.5వేలు అడ్వాన్సు కూడా తీసుకున్నాడు.
ఈ మేరకు ఈ ఏడాది జూన్ 24వ తేదీన రాత్రి ఇంట్లో ఒంటరిగా పడుకుని ఉన్న సరోజమ్మ(65) తలపై ఆనంద్ బండరాయి వేసి కర్రలతో కొట్టి చంపేశాడు. వృద్ధురాలు అని కూడా చూడకుండా అత్యాచారం చేసి, మెడలోని మంగళసూత్రాన్ని, బంగారు ఆభరణాలను తీసుకెళ్లాడు. మిగతా రూ.25 వేల కోసం గోపాలరెడ్డి వద్దకు రాగా.. తర్వాత ఇస్తానని చెప్పి పంపేశాడు. తర్వాత, ఆనంద్ పిచ్చాటూరు మండలం గోవర్దనగిరిలో.. జూలై 29వ తేదీ అర్ధరాత్రి ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న సుభద్రమ్మ అనే మహిళ తలపై బండరాయితో కొట్టి గాయపరిచి.. ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకెళ్లాడు. ఈ కేసులను సవాల్‌గా తీసుకున్న నగరి సీఐ సాయినాథ్ ఆధ్వర్యంలోని బృందం సైకో కిల్లర్ ఆనంద్‌ను, సరోజమ్మ హత్యకు ప్రోత్సహించిన భర్త గోపాలరెడ్డి(70)ని, కుమారుడు నరసింహులు(42)ను, దొంగిలించిన ఆభరణాలను కొన్న సి.మన్నన్‌లను అరెస్టు చేశారు. విచారణలో తమిళనాడులో ఆనంద్ మరో రెండు హత్యలు చేసినట్లు గుర్తించారు. అరక్కోణంలో ఓ వితంతువును చంపి అత్యాచారం జరిపాడు. అదే ప్రాంతంలో భరత్(8)అనే బాలుడిని కిడ్నాప్ చేసి, చిత్రహింసలుపెట్టి చంపేశాడు.

Share this on your social network: