నిండు గర్భిణి ప్రాణాలను తీసి పరారీ
Published: Monday August 26, 2019

కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. అగ్నిసాక్షిగా తాళికట్టి ఏడడుగులు వేసిన భర్తే ప్రాణాలు హరిస్తాడని ఆ ఇల్లాలు కలలో కూడా ఊహించివుండదు. నిండుగర్భిణి అని కూడా కనికరం లేకుండా భార్యను, మరో మూడు రోజుల్లో బయట ప్రపంచాన్ని చూడాల్సిన బిడ్డను కూడా పొట్టనపెట్టుకున్నాడు. ఈ ఘటన గంగవరం మండలంలో ఆదివారం చోటుచేసుకొంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు..
గండ్రాజుపల్లె పంచాయతీ, జంగాలపల్లెకు చెందిన గట్టప్ప, యశోదమ్మ కుమార్తె మీన(28), పలమనేరు మండలం, పి.వడ్డూరుకు చెందిన నారాయణకు 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి బిందు(2) కుమార్తె కలదు. ప్రస్తుతం గర్భిణి అయిన మీన ప్రసవం కోసం నెల రోజుల క్రితం పుట్టినింటికి వెళ్లింది. మరో మూడు రోజుల్లో ప్రసవం ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ తరుణంలో భర్త నారాయణ.. భార్యను చూడడానికి జంగాలపల్లెకు వెళ్లాడు. రాత్రి అక్కడే ఒక గదిలో భార్య, భర్త, పాప కలిసి నిద్రించేందుకు వెళ్లారు. రాత్రి ఏమి జరిగిందో తెలియదు కానీ భార్య మీనను బండరాయితో తలపై మోది, తరువాత తాడుతో మెడకు ఉరి బిగించి ఊపిరాడకుండా చంపేశాడు.
అనంతరం ఏమీ తెలియనట్లు ఉదయం 5 గంటల ప్రాంతంలో గదిలో నుంచి బోరున విలపిస్తున్న పాపను బయటకు తీసుకువచ్చి కుటుంబసభ్యులకు అప్పగించి పరారైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేయటంతో డీఎస్పీ ఆరీఫుల్లా, సీఐ రామకృష్ణాచారి, ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకున్నారు. శవాన్ని పంచనామ నిమిత్తం పలమనేరు ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న నారాయణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనాదైన చిన్నారి బిందు సంరక్షణ బాధ్యతల్ని ఐసీడీఎస్ తీసుకుంటుందని సూపర్‌వైజర్ సుగుణ మృతురాలి కుటుంబ సభ్యులకు తెలిపారు.

Share this on your social network: