తండ్రి పథకం.. తనయుడి ఆచరణ
Published: Friday August 30, 2019

రక్తం పంచుకు పుట్టిన కొడుకే తల్లి, అక్కలను కడతేర్చాడు. తండ్రి వేసిన పథకాన్ని తనయుడు ఆచరించాడు. నాన్న మీద ఉన్న ప్రేమతో ఈ కిరాతకానికి పాల్పడ్డాడు. తల్లి నోట్లో దుస్తులు కుక్కి విచక్షణ రహితంగా హతమార్చాడు. రామచంద్రపురంలో ఈ నెల 25న వెలుగుచూసిన జంట హత్యల కేసులో నిందితుడి వివరాలను డీఎస్పీ ఎం.రాజగోపాల్‌రెడ్డి గురువారం వెల్లడించారు. రావులపాలెంకు చెందిన బలసా శ్రీనివాస్‌కు అదేప్రాంతానికి చెందిన మాధవి(45)తో 2000లో వివాహమైంది. కొంతకాలం అక్కడే ఉన్నారు. ఆరేళ్ల క్రితం రామచంద్రపురం గంగుమళ్ల వారివీధిలోని ఓ ఇంటికి అద్దెకు వచ్చారు. వారికి ఇద్దరు పిల్లలు. మూడేళ్ల నుంచి భర్త, పదహారేళ్ల కుమారుడు కాకినాడలోని ఓ హోటల్‌లో పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు. కుమార్తె బలసా కరుణ(18)తో మాధవి రామచంద్రపురంలో ఉంటోంది. శ్రీనివాస్ కాకినాడలో మరో మహిళను వివాహం చేసుకున్నాడు.
దీంతో మాధవి, కరుణ.. శ్రీనివాస్‌ను చేతబడి చేసి చంపుతామని, పోలీసులకు ఫిర్యాదుచేస్తామని తరచూ బెదిరించేవారు. అవే బెదిరింపులు ప్రతీ శనివారం రామచంద్రపురం వస్తున్న కొడుకు వద్ద అనేవారు. ‘చదువుకునే వయస్సులో నిన్ను మీ నాన్న హోటల్ పనిలో పెట్టాడు. నీ భవిష్యత్ పాడైపోతోంది.. మీనాన్న చస్తేగాని మన కుటుంబం బాగుపడదు’అని తల్లి అనేది. ఆ విషయాలన్నీ తండ్రికి చెప్పేవాడు. ‘వారు నిజంగా నన్ను చంపేస్తే నువ్వు, మీపిన్ని (సవతి తల్లి) దిక్కులేని వారవుతారు. అదే నువ్వే వారిద్దరినీ చంపేశావనుకో.. మనం హాయిగా ఉండొచ్చు’అని కొడుకుతో అన్నాడు. అదే నిజమనుకున్న కొడుకు తండ్రి సూచనను పాటించాడు.
కొడుకు ఈ నెల 24న సైకిల్‌పై రామచంద్రపురంలోని తల్లి వద్దకు వచ్చి అక్క వద్ద పడుకున్నాడు. అర్ధరాత్రి లేచి చంపడానికి భయమేస్తోందని తండ్రికి ఫోన్‌చేసి చెప్పాడు. ‘నువ్వు చంపకపోతే నేను, పిన్ని ఆత్మహత్య చేసుకుంటాము’అని తండ్రి బెదిరించడమే కాకుండా వంటింట్లో ఉన్న సుత్తితో చంపమని సలహా ఇచ్చాడు. దీంతో అతడు వేరే గదిలో నిద్రిస్తున్న తల్లిని సుత్తితో తలపై కొట్టాడు. ఆమె ఆరుస్తుంటే నోట్లో దుస్తులు కుక్కి మరీ సుత్తితో తలపై పదేపదే మోది అతికిరాతకంగా చంపేశాడు. ఆ అలికిడికి లేవబోతున్న అక్కను సుత్తితో కొట్టి హతమార్చాడు. అనంతరం ఇంటి బయట తాళం వేసి సైకిల్‌పై కొంతదూరం వచ్చిన అతడికి అక్కడ ఏ ఆధారాలు ఉండకూడదని తండ్రి చెప్పగా తిరిగి ఇంటికి వచ్చి రక్తపు మరకలతో ఉన్న దుస్తులను మార్చుకొని తిరుగు ప్రయాణంలో బైపాస్ రోడ్డు వద్ద మొక్కలలో పడేశాడు. తల్లి సెల్‌ఫోన్‌ను, ఆధార్‌కార్డులను తీసుకొని కాకినాడ వెళ్లి అక్కడి నుంచి వారంతా పరారయ్యారని డీఎస్పీ తెలిపారు. సెల్‌ఫోన్ ఆధారంగా నిందితుడి ఆచూకీ గుర్తించామని, గురువారం తండ్రి కొడుకులను పసలపూడి బైపాస్ రోడ్డు బస్టాండు వద్ద అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామని డీఎస్పీ వివరించారు.

Share this on your social network: