ఫ్లైట్ టికెట్టు రద్దుచేయమన్నందుకు ఖాతాలో డబ్బులు కొట్టేశారు
Published: Saturday September 07, 2019

మనకు అందుబాటులోలేని ఏ సమాచారం తెలుసుకోవాలన్నా గూగుల్‌లో సెర్చ్ చేసి తెలుసుకుంటాం. సుమారు 70 శాతం మంది తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి ఇంటర్‌నెట్ ఓపెన్ చేసి గూగుల్‌లో వెతుకుతున్నారనడంలో అతిశయోక్తిలేదు. ప్రతి చిన్న విషయానికి గూగుల్‌పై ఆధారపడుతున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త నేరాలకు పాల్పడుతున్న సైబర్ కేటుగాళ్లు ఇదే మంచి అవకాశంగా భావించారు. గూగుల్‌లో ఎక్కువ మంది ఏ ఏ సమాచారం కోసం ఆధారపడుతున్నారో పసిగట్టి ఇందుగలదు అందులేదనే సందేహం లేకుండా అన్ని వెబ్‌సైట్లలోనూ చొరబడ్డారు. అత్యాధునిక టెక్నాలజీ అనుభవంతో వాటిలో కస్టమర్‌కేర్ పేరుతో నకిలీ నంబర్లకు పోన్లు చేస్తున్నారు సైబర్ దొంగలు.
మాదాపూర్ ప్రాంతానికి చెందిన యువతి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లడానికి ఫ్లైట్ టికెట్టు బుక్ చేసుకుంది. అనివార్య కారణాలవల్ల తన ప్రయాణం రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో తన ఫ్లైట్ టికెట్ ను క్యాన్సిల్ చేద్దామని కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్‌లో వెతికింది. తాను వెతికిన వెబ్‌సైట్లో ఫ్లైట్ టికెట్ బుకింగ్ కస్టమర్‌కేర్ పేరుతో ఒక నంబర్ కనిపించింది. ఆ నంబర్‌కు యువతి ఫోన్‌చేసి తన ఫ్టైట్ టికెట్ క్యాన్సిల్ చేయడం గురించి మాట్లాడింది. దాంతో అవతలి వ్యక్తి సరే అని జవాబిచ్చాడు. టికెట్ క్యాన్సిల్ చేసిన తర్వాత డబ్బులను మీ ఖాతాలో వేయాలంటే మీ బ్యాంకు ఖాతా నంబర్ వివరాలు కావాలన్నాడు. అందుకుగాను మీ ఫోన్‌కు ఒక లింకు పంపతున్నాను దాంట్లో వివరాలు రాసి, తిరిగి మా నంబర్‌కు పంపండి అని చెప్పాడు. అతను చెప్పిన విధంగానే తన ఫోన్‌కు వచ్చిన లింకును ఓపెన్ చేసి తన వివరాలు రాసి పంపింది. ఆ తర్వాత కొద్దిసేటికే తన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.80వేలు వేరే ఖాతా కు ట్రాన్స్‌ఫర్ అయినట్లు మెసేజ్ వచ్చింది. అనుమానం వచ్చిన బాధితురాలు అప్పటి వరకు మాట్లాడిన కస్టర్‌మర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ ఉంది.
గూగుల్‌లోకి చొరబడిన సైబర్ దొంగలు అనేక రకాల వెబ్‌సైట్లలో పాగా వేశారు. కస్టమర్‌కేర్ పేరుతో ఉన్న నంబర్‌కు ఏమరుపాటుగా ఫోన్ చేసినప్పుడు వారి మాటల్లో మాయ చేస్తున్నారు. మెసేజ్ రూపం లో లింక్‌ను పంపిస్తున్నారు. బాధితులు లింక్‌ను ఓపెన్ చేయగానే వారి ఫోన్‌లో ఉన్న డేటా అంతా సైబర్ నేరగాళ్లకు తెలిసిపోతోంది. ఫోన్‌లో బ్యాంకు ఆన్‌లైన్ లావాదేవీలు జరుపుతున్న వారి యూపీఐ వివరాలన్నీ సైబర్ నేరగాళ్లు తెలుసుకుంటున్నారు. దాంతో బాధితుల ప్రమేయం లేకుండానే ఖాతాలో డబ్బు ఖల్లాస్ అవుతోందని సైబర్‌క్రైం పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలు తెలిపిన వివరాల ఆధారంగా నిందితులు ఢిల్లీకి చెందిన సైబర్ నేరగాళ్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

Share this on your social network: