కారులో ఐదుగురు సజీవదహనం

Published: Sunday September 15, 2019
ఒక నిండు కుటుంబాన్ని అతివేగం కాల్చేసింది. ఆ వేగానికి కారు అదుపు తప్పి ఇనుప ప్రహరీని ఢీకొట్టింది. అక్కడ ఆగలేదు. మరో 40 అడుగులు దూసుకెళ్లింది. అప్పటికీ కంట్రోల్‌ కాలేదు, వేగమూ తగ్గలేదు. బోల్తా కొట్టి, ఆ వెంటనే అంటుకొన్న మంటల్లో కాలిపోయింది. భగభగమనే ఆ మంటల్లో ఐదుగురు సజీవ దహనమయ్యారు. అప్పటిదాకా తమ తల్లుల వొడిలో కూర్చున్న ముగ్గురు చిన్నారులూ ఆహుతయ్యారు. వీరంతా తమ బంధువును పరామర్శించడానికి బెంగళూరు వెళుతూ చిత్తూరు జిల్లా గంగవరం ప్రాంతంలో ఈ ఘోర దుర్ఘటనకు బలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం, తిరుపతిలోని కొర్లగుంట ప్రాంతం మారుతీనగర్‌లో నివాసముంటున్న విష్ణురామ్‌(42) టీటీడీలో జూనియర్‌ అసిస్టెంట్‌. బెంగళూరులో ఉన్న తన మామ అనారోగ్యం పాలవడంతో ఆయన్ను పరామర్శించడానికి శనివారం ఉదయం ఆరు గంటలకు కుటుంబసభ్యులతో కలిసి విష్ణురామ్‌ కారులో బయలుదేరారు. గంటన్నర తర్వాత గంగవరం మండలం గో సంరక్షణశాల సమీపంలో జాతీయ రహదారిపై వెళుతుండగా అతివేగం కారణంగా అదుపు తప్పింది.
 
ఆ వేగానికి పక్కనే రోడ్డు చివర్లో ఏర్పాటుచేసిన ఇనుప ప్రహరీని కారు ఢీకొట్టి, దాదాపు 40 అడుగుల దూరం వెళ్లి బోల్తా పడింది. ఆ వెంటనే పెట్రోల్‌ ట్యాంక్‌ పేలిపోయింది. ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. ఇదంతా కనురెప్పపాటులోనే జరిగిపోయింది. కారు లోపల ఎగసిపడిన మంటల్లో విష్ణురామ్‌ భార్య జాహ్నవి (38), కుమారుడు పవన్‌రామ్‌ (12), కుమార్తె సాయి అశ్విత(9), విష్ణురామ్‌ సోదరి కళావతి(40), ఆమె కుమారుడు భానుతేజ(19) సజీవ దహనమయ్యారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారుపై నీళ్లు చల్లి మంటల్ని ఆర్పారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.