పట్టపగలు నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే..: మైనర్ బాలికపై 8మంది లైంగికంగా దాడి

Published: Monday April 30, 2018

  

పాట్నా: బీహార్ లోని జెహానాబాద్ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలు నడిరోడ్డుపై ఓ మైనర్ బాలికను ఎనిమిది మంది వ్యక్తులు లైంగికంగా వేధించారు. శనివారం సాయంత్రం దీనికి సంబంధించిన వీడియో వాట్సాప్ లో వైరల్ అయింది.

బాలిక కాళ్లు పట్టుకుని ఈడ్చుకొచ్చిన దుండగులు.. ఆమె బట్టలు విప్పడానికి ప్రయత్నించారు. బాలిక ఎంతలా ప్రతిఘటించినా వారి ఉన్మాదం ఆగలేదు. ఇదిలా ఉంటే, దారినపోయేవాళ్లంతా అదేదో సినిమా చూస్తున్నట్టు చూస్తుండిపోయారే తప్ప సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. పైగా ఆ తతంగాన్ని తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించడం గమనార్హం.

ఈ వీడియో పాట్నా పోలీసుల దృష్టికి రావడంతో జోనల్ ఐజీ హన్సన్ ఖాన్ దీనిపై సిట్ విచారణకు ఆదేశించారు. 'ఘటనకు సంబంధించి ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్ చేశాం. అందులో ఇద్దరి ముఖాలు వీడియోలో ఉన్న ఇద్దరితో సరిపోలాయి. మిగతావారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాం.' అని హన్సన్ ఖాన్ స్పష్టం చేశారు.నిందితులపై సెక్షన్-376(రేప్), పోస్కో చట్టాలతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.