నాగార్జున ఫామ్ హౌస్‌లో మృతదేహం

Published: Friday September 20, 2019
ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున వ్యవసాయ క్షేత్రంలో కనిపించిన మృతదేహం ఎవరిదో గుర్తించారు. నాలుగేళ్లుగా కనిపించకుండా పోయిన పాపిరెడ్డిగూడకు చెందిన పాండు (32)ది అని తేలింది! అక్కడే అతడు గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. చిన్న అంజయ్య-జంగమ్మ దంపతుల నలుగురు సంతానంలో పాండు చిన్నవాడు. అవివాహితుడు. మూడో అన్న కుమార్‌ అంటే పాండుకు అమితమైన ఇష్టం. కుమార్‌ అనారోగ్యంతో మృతిచెందిన నాటి నుంచి పాండు కుంగిపోయాడు. తనకు దేనిమీదా ఆశలేదని సోదరులకు చెప్పాడు.
 
అనంతరం ఓ లేఖ రాసి.. చెప్పాపెట్టకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత పాండు కోసం కుటుంబసభ్యులు చాలాచోట్ల వెతికినా ఆచూకీ దొరకలేదు. అతడి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదు. రంగారెడ్డి జిల్లా పాపిరెడ్డిగూడలోని ఈ వ్యవసాయ క్షేత్రంలో చాలా ఏళ్లుగా పనులేవీ జరగడం లేదు. వారం క్రితం ఆ వ్యవసాయ క్షేత్రానికి నాగార్జున సతీమణి అమల వెళ్లారు. సేంద్రియ పద్ధతిలో సాగు పనులు చేపట్టేందుకు కొందరిని పురమాయించారు. బుధవారం సాయంత్రం అక్కడికి కొందరు వ్యక్తులు వచ్చారు. అదే గ్రామానికి చెందిన బుద్దోలు శ్రీశైలం.. షెడ్డులోకి వెళ్లి చూడగా అస్థిపంజరం కనిపించింది. మృతదేహంపై దుస్తులు మాత్రమే మిగిలాయి. గురువారం శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌ రెడ్డి, షాద్‌నగర్‌ ఏసీపీ సురేందర్‌, షాద్‌నగర్‌ రూరల్‌ సీఐ రామకృష్ణ పరిశీలించారు. జేబులో ఆధార్‌ కార్డు కార్డు ఆధారంగా మృతుడిని పాండుగా గుర్తించారు.