దుకాణ యజమాని దాష్టీకం....దివ్యాంగుడికి వాతలు

Published: Wednesday October 16, 2019

తన వద్ద పనిచేస్తున్న దివ్యాంగుడైన యువకుడిని చిత్రహింసలకు గురిచేశాడు ఓ దుకాణ యజమాని. దొంగతనం చేశాడన్న అనుమానంతో కాల్చిన ఇనుప ఊచతో చేతిపైన, మొఖం మీద వాతలు పెట్టాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమిళనాడుకు చెందిన అబుబకర్‌(తంబి) మండల కేంద్రంలో కొన్నేళ్లుగా కిరాణా దుకాణం నడుపుతున్నాడు. తన దుకాణంలో పని చేసేందుకు తమిళనాడులోని సిక్కెల గ్రామానికి చెందిన దివ్యాంగుడైన యువకుడు రెహమాన్‌ఖాన్‌(30)ను తీసుకువచ్చాడు. రెహమాన్‌ సుమారు పదేళ్లుగా పనిచేస్తూ యజమాని ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ నెల 12న ఉదయం రెహమాన్‌కు షాప్‌లో కింద పడి ఉన్న రూ.100 నోటు కనిపించగా దొరికిందంటూ యజమాని కుమారుడి చేతికి ఇచ్చాడు. ఆ నోటును తీసుకున్న అతను.. ‘నువ్వు ఈ వందను ఎక్కడ దొంగిలించావంటూ’ కేకలు వేశాడు. అదేరోజు రాత్రి డబ్బును ఎక్కడ దొంగిలించావని ప్రశ్నిస్తూ రెహమాన్‌ను షాప్‌ యజమాని అబుబకర్‌ తీవ్రంగా కొట్టడంతో పాటు ఇనుప ఊచను కాల్చి వాతలు పెట్టాడు. బాధితుడు కాలిన గాయాలకు వైద్యం కోసం మంగళవారం స్థానిక సీహెచ్‌సీ రాగా..విషయం స్థానిక పోలీసులకు తెలిసింది. ఎస్‌ఐ ప్రసాదరావు దివ్యాంగ యవకుడిని ప్రశ్నించగా జరిగిన సంఘటనను తెలిపి భోరుమన్నాడు. యజమానిపై కేసు నమోదు చేశారు.