కూలి పని చేసే భర్తతో అవేమీ తీరడం లేదు
Published: Saturday November 02, 2019

ఆమెకు జల్సాగా బతకడం ఇష్టం. కార్లలో తిరగడమంటే సరదా! కూలి పని చేసే భర్తతో అవేమీ తీరడం లేదు! సరికదా.. తనకు కోరినవన్నీ ఇద్దరు ప్రియులు సమకూరుస్తుంటే భర్త అభ్యంతరపెట్టడం, పద్ధతి మార్చుకోవాలని మందలించడం ఆమెకు నచ్చలేదు. ఏడేళ్ల వైవాహిక బంధం గురించి గానీ, తమ మూడేళ్ల పాప భవిష్యత్తు గురించి గానీ ఆమె ఆలోచించలేదు! తన ఆనందానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్యకు పథకం వేసింది. తన ప్రియుళ్లతోనే భర్తను దారుణంగా హత్య చేయించింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు ప్రియుళ్లలో ఒకరితో సహజీవనం చేస్తోంది.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగుచూసింది. శుక్రవారం నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. అంకాపూర్‌కు చెందిన ఉదయ్ కుమార్ (40), పావని (30) దంపతులు. వీరికి కూతురు సమన్య (3) ఉంది. ఉదయ్.. రోజూ కూలికి వెళుతూ వచ్చే సంపాదనతో భార్య, బిడ్డను పోషించుకుంటున్నాడు. ఉదయ్‌కి అదే గ్రామానికి చెందిన దౌలాజీ, గంగాధర్ స్నేహితులున్నారు. దౌలాజీ కారు నడుపుతుండగా..
గంగాధర్ ఉపాధి కోసం దుబాయికి వెళ్లి.. 6 నెలల క్రితమే వచ్చాడు. దౌలాజీ, గంగాధర్‌లు తరచూ ఉదయ్‌కుమార్ ఇంటికి వస్తూపోతూ ఉండేవారు. ఈ క్రమంలో వారిద్దరితో పావనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలిసిన భర్త పలుమార్లు ఆమెను మందలించాడు. భర్తను అడ్డు తొలగించుకుంటే తన వివాహేతర సంబంధానికి ఎలాంటి సమస్యలు ఉండవని భావించింది. భర్త హత్యకు పథకం వేసి.. ఆ పనికి తన ప్రియుళ్లను పురమాయించింది. పథకం ప్రకారం దౌలాజీ, గంగాధర్ ఉదయ్‌ని నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గోదావరి సమీపాని కి తీసుకెళ్లి అతిగా మద్యం తాగించారు. అనంతరం నదిలో స్నానం చేద్దామని నమ్మించి.. గోదావరి నీళ్లలో ముంచి హత్యచేశారు. కాగా పావని ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి.
జూన్ 9న పొన్కల్ గోదావరి నదిలో అనుమానాస్పద స్థితిలో ఓ మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అటు.. తన అన్న ఎందుకు కనిపించడం లేదని, ఫోన్ చేసినా ఎందుకు స్విచాఫ్ వస్తోందంటూ పావనిని ఉదయ్ సోదరి లక్ష్మి ఫోన్‌చేసి అడిగింది. తనకేమీ తెలియదని పావని అనుమానాస్పదంగా జవాబు చెప్పడంతో అంకాపూర్‌లోని ఇంటికి వచ్చింది. అక్కడ దౌలాజీ అనే యువకుడితో పావని సహజీవనం చేస్తూ కనిపించింది. దీంతో వదినను మందలించిన లక్ష్మి.. పోలీసులకు సమాచారం ఇచ్చింది.
ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా.. వీరిద్దరూ ఇటీవలే బెయిల్‌పై వచ్చి మళ్లీ సహజీవనం కొనసాగించారు. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లా మామడ ఎస్సై ఆసీఫ్ శుక్రవారం న్యూ సాంగ్వి క్రాస్ రోడ్డు వద్ద బైక్‌పై వెళుతున్న దౌలాజీ, పావనిలను పట్టుకున్నారు. వారిని పోలీసులు తమదైన శైలిలో విచారించగా నేరం ఒప్పుకొన్నారు. సోన్ సీఐ జీవన్ రెడ్డి, ఎస్సై ఆసీఫ్ ఈ మేరకు కేసు నమోదు చేసుకొని నిందితులను కోర్టులో హాజరు పరుస్తామన్నారు. కాగా ఉదయ్ హత్య కేసులో కీలకపాత్ర పోషించిన పావని రెండో ప్రియుడు గంగాధర్ పథకం ప్రకారం దుబాయి చెక్కేశాడు.

Share this on your social network: