కొడుకును ప్రియుడితో చంపించింది!

Published: Monday December 30, 2019
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే అక్కసుతో ఓ మహిళ తన కన్నకొడుకును ప్రియుడితో హత్య చేయించింది. మంగళగిరి మండలం పెదవడ్ల పూడిలో ఈ దారుణం చోటుచేసుకుంది. మంగళగిరి రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో నార్త్‌సబ్‌ డివిజన్‌ డీఎస్పీ డి.దుర్గాప్రసాద్‌, రూరల్‌ సీఐ ఎం.శేషగిరిరావులు ఈ కేసు వివరాలను వెల్లడించారు.
 
మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన చిలక బాలస్వామికి నందివెలుగు పంచాయతీ పరిధిలోని జాషువానగర్‌కు చెందిన కసుకుర్తి రాణితో వివాహేతర సంబంధం ఉంది. రాణికి డిగ్రీ చదువుతున్న హార్ధిక్‌ రాయ్‌(19) అనే కుమారుడు ఉన్నాడు. తల్లి వేరే వ్యక్తితో సాగిస్తున్న వివాహేతర సంబంధంపై కొంతకాలం క్రితం హార్ధిక్‌రాయ్‌ నిలదీశాడు. దీంతో రాణి, ఆమె ప్రియుడు బాలస్వామిలు నవంబరు 18వ తేదీన తెనాలిలో కలుసుకుని హార్ధిక్‌రాయ్‌ హత్యకు పథకాన్ని రచించారు. అనుకున్నదే తడవుగా మరుసటి రోజు బాలస్వామి హార్ధిక్‌రాయ్‌కు ఫోన్‌ చేసి తెనాలిలో కొత్త దుస్తులు కొనిపెడతానని, నందివెలుగు జాషువానగర్‌ రోడ్డుకు రమ్మని చెప్పాడు. నిజమేనని నమ్మిన హార్ధిక్‌ రాయ్‌ అక్కడికి వెళ్లాడు. బాలస్వామి అతడిని తన మోపెడ్‌పై ఎక్కించుకుని తెనాలిలో రాణి పని చేసే వాటర్‌ ప్లాంట్‌ వద్దకు తీసుకువెళ్లాడు. ఆమెను కూడా వెంటబెట్టుకుని నందివెలుగు వద్దకు వచ్చారు.
 
అక్కడ ముగ్గురూ టిఫిన్‌ చేశారు. అదే సమయంలో రాణిని బాలస్వామి పక్కకు పిలిచి హార్ధిక్‌రాయ్‌ను ఈ రోజు హత్య చేస్తానని, ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని ఆమెను ఆటోలో ఎక్కించి ఇంటికి పంపాడు. అనంతరం రాత్రి 7 గంటల సమయంలో బాలస్వామి హార్ధిక్‌రాయ్‌ను అక్కడ నుంచి కొబ్బరి బోండాలు తాగి వద్దామని నమ్మించి మంగళగిరి మండలం పెదవడ్లపూడి లాకుల వద్దకు తీసుకు వెళ్లాడు. సమీపంలోని పంటపొలంలో గల షెడ్డులోకి వెళ్లిన బాలస్వామి తాడును తీసుకువచ్చి వెనుకగా హార్ధిక్‌రాయ్‌ మెడకు బిగించి హత్య చేశాడు. తరువాత ఆ మృతదేహం కాళ్లు, చేతులను సైతం తాడుతో బంధించి షెడ్డులో పెట్టి తాపీగా ఇంటికి వెళ్లిపోయాడు. భోజనం చేసిన అనంతరం ఇంకా జన సంచారం ఉండటంతో రేవేంద్రపాడు సెంటర్‌కు వెళ్లి సెకండ్‌షో సినిమా చూసి తిరిగి ఎవరూ లేని సమయంలో అర్ధరాత్రి షెడ్‌ వద్దకు చేరుకున్నాడు.
 
హార్ధిక్‌రాయ్‌ మృతదేహాన్ని భుజాన వేసుకుని మురుగు కాలువ తూము వద్దకు తీసుకువెళ్లాడు. శవం పైకి తేలకుండా ఉండటానికి నడుముకు పెద్ద రాయికట్టి నీళ్లలో ఉన్న తూములో పడవేసి పారిపోయాడు. కొన్ని రోజుల తరువాత తూములో నుంచి దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానిక రైతులు మంగళగిరి రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీయించారు. అప్పటికే కుళ్లిన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కీలక ఆధారాలను సేకరించారు.