గుంటూరులో దారుణం.........! ఓ కసాయి భాగోతం!!!

పట్నంబజార్, గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి దిగడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత కూడా ఇది కొనసాగుతోంది. పాతగుంటూరు బాలాజీనగర్‌లోని ఓ ప్రాంతంలో ఉండే ఈ బాలిక రెండో తరగతి చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన రఘు (20) మంగళవారం ఆ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. వెంటనే కేకలు వేస్తూ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఆ బాలికను స్థానికులు ఏం జరిగిందన్నది అడగడంతో జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో కోపోద్రిక్తులైన వారు ఆ యువకుడిని పట్టుకోవడానికి వెంటపడ్డారు. అతను అక్కడి నుంచి పారిపోయి పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ సమాచారం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు పెద్దసంఖ్యలో రహదారులపైకి చేరి ఆందోళనకు దిగారు. మరికొందరు పోలీసుస్టేషన్‌కు వెళ్లి యువకుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ సమాచారం అందిన వెంటనే పాతగుంటూరు సీఐ బత్తుల శ్రీనివాసరావు హుటాహుటిన స్టేషన్‌కు చేరుకొని సిబ్బందిని అప్రమత్తం చేశారు. అయినప్పటికి ఆందోళనకారులు ఒక్కసారిగా పోలీసుస్టేషన్‌పైకి దూసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఆగ్రహావేశాలతోఉన్న నిరసనకారులు నూతనంగా నిర్మించిన ఆదర్శ పోలీసుస్టేషన్‌పై రాళ్లవర్షం కురిపించగా దాని అద్దాలు పగిలాయి.పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. వారిని నిలువరించే ప్రయత్నంలో పోలీసులు లాఠీఛార్జి చేయటంతోపాటు రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. పలువురు నాయకులు స్టేషన్ వద్దకు చేరుకొని పోలీసు అధికారులతో చర్చిస్తున్నారు. ఘటనపై ఆ బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Share this on your social network: