విద్యార్థిని తండ్రిపై కానిస్టేబుల్ దాడి

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమెలలోని నారాయణ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని సంఽధ్యారాణిది ఆత్మహత్య కాదని.. ఎవరో హత్య చేశారని ఆరోపిస్తూ మృతదేహాన్ని మార్చురీ నుంచి తరలించేందుకు చేసిన యత్నం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బుధవారం సంధ్యారాణి మృతదేహాన్ని మార్చురీ నుంచి నారాయణ కాలేజీకి తరలించి.. అక్కడ ధర్నా చేసేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించారు. ఉదయం బంధువులు, పలు విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి సంధ్యారాణి తల్లిదండ్రులు పటాన్‌చెరులోని మార్చురీ తాళాలు పగులగొట్టారు. విద్యార్థిని మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న పటాన్‌చెరు డీఎస్పీ రాజేశ్వరరావు, సీఐ నరేష్, బీడీఎల్ సీఐ రాంరెడ్డి సిబ్బందితో హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. ఆందోళనకారులను అడ్డుకున్నారు. విద్యార్థిని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు పోలీసులను ప్రతిఘటించడంతో, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
మృతదేహం ఉన్న ఫ్రీజర్‌ను తిరిగి ఆసుపత్రిలోనికితీసుకెళ్లేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాన్ని విద్యార్థిని తండ్రి చంద్రశేఖర్ తీవ్రంగా ప్రతిఘటించాడు. ఆ సమయంలో ఓ కానిస్టేబుల్ తన కాలితో చంద్రశేఖర్ కడుపులో తన్నడం వివాదాస్పదమైంది. అసలే బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తండ్రి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు పోలీసుస్టేషన్‌కు తరలించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య సాయంత్రం విద్యార్థిని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా.. సంధ్యారాణి మృతిపై ఆమె తండ్రి చంద్రశేఖర్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన బిడ్డకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని, ఎవరో హత్య చేసి.. బాత్‌రూమ్‌లో పడేశారని చెబుతున్నారు. దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

Share this on your social network: