హర్యానాలో దారుణం: గంటలో ఆరుగురిని చంపిన మాజీ ఆర్మీ ఉద్యోగి ..

Published: Tuesday January 02, 2018

ఛంఢీఘడ్: హర్యానా రాష్ట్రంలో ఓ సైకో ఆరుగురిని హత్య చేశాడు. పలువురిని గాయపర్చాడు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో మంగళవారం నాడు ఉదయం చోటు చేసుకొంది. ఈ ప్రాంతంలో పోలీసులు హై అలెర్ట్ విధించారు. హార్యానా రాష్ట్రంలోని పల్వాల్ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఓ వ్యక్తి చేతిలో రాడ్ పట్టుకొని దొరికిన వారిని దొరికినట్టు చితక్కొట్టాడు. ఆ యువకుడి దాడిలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. పలువురు ఈ దాడిలో గాయపడ్డారు. నిందితుడిని నరేష్ దంకుడుగా గుర్తించారు. అయితే నరేష్ గతంలో ఆర్మీలో పనిచేసి రిటైరయ్యారని పోలీసులు చెబుతున్నారు. సోమవారం తెల్లవారుజామున రాత్రి రెండున్నర గంటల నుండి మూడున్నర గంటల మధ్య ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు తెలిపారు.
నిందితుడి దాడిలో ఓ మహిళతో పాటు మరో ఐదుగురిని హత్య చేశాడు. మొత్తం ఆరుగురు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. గంట వ్యవధిలో ఆరుగురిని నిందితుడు హత మార్చాడు. మృతదేహలు రెండు మూడు కిలోమీటర్ల పరిధిలో పడి ఉన్నాయి. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు వెళ్ళిన పోలీసులపై కూడ నిందితుడు దాడికి పాల్పడ్డాడు. అయితే ఈ దాడిలో పోలీసులు కూడ గాయపడ్డారు.మతిస్థిమితం కోల్పోయి నిందితుడు ఈ రకంగా వ్యవహరించాడా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.