ఆక్సిజన్ తీసేశారు.. ఊపిరి ఆడటం లేదు
ఆస్పత్రి బెడ్ మీద ఉన్న అతడు మాట్లాడుతుంటే శ్వాస సరిగా అందక గొంతు వణుకుతోంది. తనకు ఊపిరి ఆడటం లేదని, ఆ విషయాన్నే వైద్యులకు చెప్పినా పట్టించుకోలేదని.. పెట్టిన ఆక్సిజన్ కూడా తొలగించారని వాపోయాడు! తన ఈ ఆవేదనంతా సెల్ఫీ వీడియో ద్వారా కన్నతండ్రికి చెప్పుకొన్నాడు. ‘ఊపిరి ఆడటం లేదని చెప్పినా ఆక్సిజన్ బంద్ చేసిన్రు. సార్ సార్ అని బతిమిలాడినా పట్టించుకోలేదు. ఇప్పటికే మూడు గంటలైంది. గుండె ఆగిపోయింది. ఊపిరొక్కటే కొట్టుకుంటోంది. డాడీ బై.. డాడీ బై, అందరికీ బై డాడీ’ అంటూ వాట్సా్‌పలో పోస్ట్ చేశాడు. తాను ఇంకా ఎంతో సేపు బతకనని అనుకుని ఆ వీడియో పోస్ట్ చేశాడో ఏమో అదే నిజమైంది. వీడియోలో కొడుకు దయనీయ స్థితిని చూసిన తండ్రి, ఆ షాక్ నుంచి తేరుకునేలోపే కుమారుడు ఇక లేడనే సమాచారం వచ్చింది. కరోనా లక్షణాలతో హైదరాబాద్ ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన 35 ఏళ్ల రవి కుమార్ విషాదం ఇది. ప్రాణం విడిచే ముందు రవి పోస్ట్ చేసిన వీడియో, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి.. కన్నీరు పెట్టిస్తోంది. రెండు రోజుల క్రితం స్వయంగా తాను ఆటోలో ఎక్కించుకొని ఆస్పత్రిలో చేర్పించిన కుమారుడు ఇక లేడని తెలిసి.. ప్రాణం పోయే కొన్ని క్షణాల ముందు అతడు పడ్డ యాతనను చూసి ఆ తండ్రి గుండె పగిలింది. సరైన వైద్యం అందకపోవడం వల్లే తన కొడుకు చనిపోయాడని.. ఈ పరిస్థితి ఎవ్వరికీ రావొద్దని తండ్రి వెంకటేశ్ విలపించాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై వెంకటేశ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 24న రవిని వెంకటేశ్ చెస్ట్ ఆస్పత్రిలో చేర్పించాడు. రెండు రోజుల పాటు వెంకటేశ్ ఆస్పత్రి వద్దే గడిపాడు. 26న ఆస్పత్రి బయట చెట్టు కింద కూర్చుని ఉన్న సమయంలో వాట్సా్‌పలో రవి పంపిన వీడియోను చూశాడు. ఆస్పత్రిలో కొడుకు దయనీయ స్థితిని చూసి షాక్‌లో ఉన్న అతడికి ఆ వెంటనే కుమారుడు చనిపోయాడంటూ సిబ్బంది సమాచారం ఇచ్చారు.

Share this on your social network: