మంచి పేరు వస్తుందని ఓర్వలేక హత్య

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంతటి ఘోరానికి పాల్పడతారని ఊహించలేదని మోకా భాస్కర్‌రావు భార్య వెంకటేశ్వరమ్మ వాపోయింది. భాస్కర్‌రావు ఎప్పుడు ప్రజల పక్షాన పోరాడే వ్యక్తి అని తెలిపారు. ప్రజా సమస్యలపై ఎవరినైనా నిలదీస్తూ ఉంటారని, గుటాల చెరువు వివాదంపై ప్రశ్నించినందుకే భాస్కర్‌రావుపై కక్షగట్టారని తెలిపారు. సునామీ వచ్చిన సమయంలో హత్య కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వారికి స్వయంగా భాస్కర్ రావు ఇళ్లు నిర్మించి ఇచ్చారని గుర్తుచేశారు. తన భర్తకు మంచి పేరు వస్తుందని ఓర్వలేక కుట్రపన్ని హత్య చేశారని, రాజకీయ లబ్ధి కోసం ఇంతటి దారుణానికి పాల్పడి హత్య చేస్తారని అనుకోలేదని ఆమె చెప్పారు. ఈ హత్య కేసులో ప్రమేయం లేకపోతే కొల్లు రవీంద్ర ఇల్లు విడిచి ఎందుకు పారిపోవాలి..? అని ప్రశ్నించారు. తన భర్త హత్య కేసులో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వెంకటేశ్వరమ్మ కోరారు.
గత నెల 29న మచిలీపట్నంలో మోకా భాస్కర్‌రావు పట్టపగలే దారుణ హత్యకు గురయ్యారు. భాస్కర్‌రావు మంత్రి పేర్ని నానికి అత్యంత సన్నిహితుడు కావడం.. మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్ 23 వ డివిజన్ వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉండగా ఈ హత్య జరగడంతో స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మచిలీపట్నంలోని చేపలమార్కెట్‌లో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించేందుకు సోమవారం ఉదయం 11గంటల సమయంలో భాస్కరరావు ద్వి చక్రవాహనంపై వచ్చారు. చేపలమార్కెట్ నుంచి బయటకు వస్తుండగా కొందరు దుండగులు బైక్‌పై వచ్చి ఆయనపై కత్తులతో దాడి చేశారు. గుండెలో కత్తులతో పొడవడంతో భాస్కర్‌రావు అక్కడిక్కడే కుప్పకూలిపోయారు.
భాస్కర్‌రావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం సీతాపు రం వద్ద జాతీయ రహదారిపై మఫ్టీలో ఉన్న కృష్ణా జిల్లా పోలీసులు శుక్రవారం సాయంత్రం విశాఖపట్నం వైపు కారు లో వెళుతున్న కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు. కృష్ణాజిల్లా నుంచి వచ్చిన మూడు ప్రత్యేక పోలీసు బృందాలు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పోలీసుల సహకారంతో హైవేను దిగ్భందించాయి. ఈ క్రమంలో పోలీసులు కొల్లును గు ర్తించి అరెస్టు చేశారు.

Share this on your social network: