రెండు రకాల శానిటైజర్లు తాగారు?

ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలో శానిటైజర్ తాగి 17(ఇందులో ఒకరు గుంటూరు వ్యక్తి) మంది మృతి చెందిన ఘటనకు సంబంధించి అధికారులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా రెండు కంపెనీలకు చెందిన శానిటైజర్‌లు తాగిన వారిలో ఎక్కువ మంది మృతి చెందినట్లు సమాచారం. పోలీసులు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు కూడా ఆయా కంపెనీలపై విచారణ చేస్తున్నట్లు తెలిసింది. కురిచేడులో పది మెడికల్ షాపులుండగా.. గ్రామంలోని పేదలు వంద మంది వరకు శానిటైజర్ తాగడానికి అలవాటు పడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది మూడు మెడికల్ షాపుల్లో వీటిని కొనుగోలు చేసినట్లు అధికారుల విచారణలో తేలింది. దీంతో ఆయా మెడికల్ షాపుల యజమానులను స్టేషన్‌కు పిలిపించి విచారణ చేశారు.
అయితే, తాము లూజ్ అమ్మలేదని.. తమకు వచ్చిన బాటిళ్లను అలాగే అమ్మినట్లు కురిచేడులోని మందుల షాపుల యజమానులు పోలీసులకు వివరణ ఇచ్చారు. మెడికల్ షాపులు నిర్వహిస్తున్న వారి ఇళ్లలో సోమవారం దర్శి డీఎస్పీ ప్రకాశరావు ఆధ్వర్యంలో సోదాలు చేశారు. ఒంగోలు, పామూరులో కూడా మరణాలు సంభవించడంతో అక్కడా విచారణ చేశారు. కాగా, గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరులోని ఫార్మాసూటికల్ కంపెనీలోనూ స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(ఎస్‌ఈబీ) డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ చేశారు.

Share this on your social network: