మజ్జిగ తాగుతుంటే మనీ ఎత్తుకెళ్లాడు

Published: Saturday May 26, 2018
ఓ వ్యక్తి మజ్జిగ తాగుతుండగా గుర్తు తెలియని వ్యక్తి అతని జేబులో డబ్బు తీసుకుని ఉడాయించిన ఘటన సత్యనారాయణపురంలో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బుడమేరు మధ్య కట్టపై ఉండే కాటసాని దానిరెడ్డి అమలీ స్కూల్‌లో అటెండర్‌గా పనిచేస్తుంటాడు. స్కూల్‌కు సంబంధించిన రూ.52వేలను ఆయన శుక్రవారం ఉదయం ఎన్నార్పీ రోడ్డులోని కార్పొరేషన్‌ బ్యాంక్‌ నుంచి డ్రా చేశారు. ఆ డబ్బును చొక్కా జేబులో పెట్టుకున్నారు. ఇంతలో బ్యాంకు సమీపంలోని మజ్జిగ కేంద్రంలో మజ్జిగ తాగడానికి వెళ్లారు.
 
మజ్జిగ తాగుతుండగా, గమనించిన గుర్తుతెలియని వ్యక్తి అతని జేబులో డబ్బు కాజేసి పరుగుపెట్టాడు. కొంతదూరం వెంబడించాక... ఆ వ్యక్తి బైకుపై ఉడాయించాడు. దీంతో బాధితుడు సత్యనారాయణపురం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పొలీసులు బ్యాంక్‌, చుట్టుపక్కల దుకాణాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.