అభంశుభం తెలియని పన్నెండేళ్ల బాలికపై మృగాళ్లు విరుచుకుపడ్డారు. ఏకంగా 11 మంది సామూహిక అత్యాచార

Published: Sunday May 27, 2018

అభంశుభం తెలియని పన్నెండేళ్ల బాలికపై మృగాళ్లు విరుచుకుపడ్డారు. ఏకంగా 11 మంది సామూహిక అత్యాచారం చేశారు. సభ్యసమాజం తలదించుకునే ఈ దారుణ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో చోటుచేసుకుంది. కోవై ఆనైకట్టి ప్రాంతానికి చెందిన బాలికను అదే ప్రాంతానికి చెందిన ఇందూజ ఈ నెల 19న తిరునాళ్లకు అని చెప్పి.. తల్లిదండ్రులకు తెలియకుండా తీసుకెళ్లింది. ఎంతసేపటికీ కుమార్తె ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పలుచోట్ల వెతికారు. ఫలితం లేకపోవడంతో అగలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సమాచారాన్ని సమీపంలోనున్న సోళయూర్‌ పోలీసులకు అందించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సోళయూర్‌ పోలీసులు ఊదివలి ఆలయ ఉత్సవాలకు భద్రతకోసం బయలుదేరారు. దారిమధ్యలో ఓ గుడిసెలో ఇందూజతో ఉన్న బాలికను కాపాడారు. బాలికను ఇందూజ అపహరించి 11 మంది యువకుల వద్ద వదిలేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులు బాలికను నాలుగు రోజుల పాటు గదిలో బందించి దారుణానికి ఒడిగట్టారు. అయితే ఇందూజ బాలికను యువకుల వద్ద ఎందుకు వదిలేసిందనేది మాత్రం తెలియరాలేదు. బాలికపై దారుణానికి ఒడిగట్టిన వీనస్‌రాజ్‌ (20), శివకుమార్‌ (23), రాజేష్‌ (25), కుమార్‌ (23), మణికంఠన్‌ (20), అరవింద్‌ (21), ఈశ్వరన్‌ (22) తదితరులు మొత్తం 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం  బాలికను ఆసుపత్రికి తరలించారు. ఇందూజను కూడా అరెస్టు చేశారు. నిందితులను మన్నర్‌ న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు తీసుకెళుతుండగా వీనస్‌రాజ్‌ పరారయ్యాడు. మిగిలినవారిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.