భార్యను దారుణంగా కొట్టి, ఉరేసి చంపిన భర్త

Published: Monday May 28, 2018

మహేశ్వరం, న్యూస్‌టుడే: ప్రేమించాడు.. పెద్దలను ఒప్పించి కులాంతర వివాహం చేసుకున్నాడు. ఏడాదిన్నర తిరగకుండానే భార్యను వరకట్న వేధింపులతో అతి కిరాతకంగా కొట్టి చంపి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు భర్త. à°ˆ సంఘటన మహేశ్వరం ఠాణా పరిధిలోని నాగారం పంచాయతీ పడమటి తండాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగారం పడమటి తండాకు చెందిన కాట్రావత్‌ విఠల్‌నాయక్‌ (28), శంషాబాద్‌ మండలం గొల్లపల్లికి చెందిన ఐశ్వర్య(23) ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాలను ఒప్పించి పెద్దల సమక్షంలో ఏడాదిన్నర క్రితం శంషాబాద్‌ సిద్దులగుట్ట ఆలయం వద్ద పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు వీరి సంసారం బాగానే సాగినా.. ఏడాది నుంచి భర్త విఠల్‌నాయక్‌ వరకట్నం కోసం ఐశ్వర్యను వేధిస్తున్నాడు. గతంలో శంషాబాద్‌ ఠాణాలో విఠల్‌నాయక్‌పై వరకట్న వేధింపుల కేసు నమోదైంది.

కాగా సోమవారం రాత్రి ఇంటికి చేరుకున్న విఠల్‌నాయక్‌ భార్య ఐశ్వర్యతో గొడవపడి విచక్షణారహితంగా కొట్టడంతోపాటు వ్యవసాయ పొలంలోకి తీసుకెళ్లి చున్నీతో ఉరేసి హత్య చేశాడు. అనంతరం మహేశ్వరం ఠాణాకు వెళ్లి లొంగిపోయాడు. సమాచారం అందుకున్న సీఐ సునిల్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.

ఐశ్వర్య తల్లి పూజ ఫిర్యాదు మేరకు విఠల్‌నాయక్‌తోపాటు కుటుంబసభ్యులపై వరకట్న వేధింపుల కేసు, హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు