పట్టపగలే యువతి దారుణ హత్య నగల షాప్‌లో ఉన్మాది ఘాతుకం

హైదరాబాద్‌లో ప్రేమోన్మాది దాడి కలకలం సృష్టించింది. తన ప్రేమను యువతి తిరస్కరించిందనే కోపంతో ఒంటరిగా ఉన్న ఆమెపై సైకోలా ప్రవర్తించాడు. వేధింపులకు గురిచేశాడు. అయినా దారికి రాలేదన్న కోపంతో బ్లేడుతో దాడి చేశాడు. గొంతు కోశాడు. ఆపై కొన ఊపిరితో ఉన్న యువతి మెడకు చున్నీ చుట్టి ఊపిరాడకుండా చేశాడు. మృతి చెందిందని నిర్ధారించుకున్న తర్వాతే అక్కడి నుంచి పారిపోయాడు. ఈ హత్యలో అతనికి మరో ఇద్దరు సహకరించారు. రెండు గంటల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. జన సంచారం ఉన్న రోడ్డుకు పక్కన పట్టపగలే ఓ షాపులో హత్య చోటుచేసుకోవడం యూసు్‌ఫగూడలోని జవహర్‌నగర్‌లో కలకలం సృష్టించింది. తూర్పుగోదావరి జిల్లా రావుపాలెంకు చెందిన అగ్గిరాముడు, అన్నపూర్ణ దంపతులు తొమ్మిదేళ్ల క్రితం నగరానికి వచ్చారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కొడుకు ఉన్నారు. మూడేళ్లుగా జవహర్‌నగర్‌లో నివాసముంటున్నారు. వీరి పెద్ద కుమార్తె వెంకటలక్ష్మి(18) రెండు నెలల క్రితం జవహర్‌నగర్ ప్రధాన రోడ్డులో ఉన్న జోడీ ష్యాషన్ జువెలరీలో సెల్స్‌మెన్‌గా చేరింది. కాగా, సోమవారం ఉదయం షాపు యజమానులు దినేశ్, జ్యోత్స్న ఖమ్మం వెళ్లారు. షాపు నిర్వహణ బాధ్యతను వెంకటలక్ష్మికి అప్పగించారు. ఆమె ఒంటరిగా ఉన్న విషయం తెలుసుకున్న మధురానగర్‌కు చెందిన సాగర్ మధ్యాహ్నం 1.50 గంటలకు షాపులోకి వచ్చాడు. ప్రేమిస్తున్నానంటూ వేధించాడు. గల్లాలో ఉన్న డబ్బులు తీసుకొని సతాయించాడు. తనను యువకుడు వేధిస్తున్నాడని వెంకటలక్ష్మి యజమానికి ఫోన్ చేసి చెప్పింది. భయపడ్డ యువకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఓ గంట తర్వాత మద్యం సేవించి మరో ఇద్దరితో కలిసి షాపు వద్దకు వచ్చాడు. మరోసారి వెంకటలక్ష్మిని ప్రేమించాలని కోరాడు. ఆమె తిరస్కరించడంతో కోపోద్రిక్తుడై తనతో తెచ్చుకున్న బ్లేడుతో గొంతు కోసాడు. తీవ్ర రక్తస్రావంతో వెంకటలక్ష్మి కిందపడి కొట్టుకుంది. ఆమె కొన ఊపిరితో ఉన్నట్టు గమనించిన యువకుడు చున్నీతో మెడ చుట్టు ఉరి బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసాడు. ఆమె మరణించినట్టు నిర్ధారించుకున్న తర్వాత షెట్టర్ వేసి పారిపోయాడు. సాయంత్రం 5 గంటలకు ఖమ్మంలో ఉన్న యజమాని దినేశ్ షాపులో ఉన్న సీసీ కెమెరాలను సెల్‌ఫోన్ ద్వారా చూసేందుకు ప్రయత్నించాడు. కానీ అవి పనిచేయలేదు. వెంకటలక్ష్మికి ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో యువతి తండ్రితోపాటు తన స్నేహితుడు జానీ పాషాకు సమాచారం ఇచ్చాడు. వారు షాపులోకి వెళ్లేసరికి వెంకటలక్ష్మి రక్తపుమడుగులో పడి ఉంది. జానీపాషా జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీంను రప్పించారు. సంఘటనా స్థలంలో హత్యకు ఉపయోగించిన బ్లేడును స్వాధీనం చేసుకున్నారు. షాపులో ఉన్న సీసీ కెమెరాల డీవీఆర్‌ను తీసుకున్నారు.

Share this on your social network: