నాలుగేళ్ల బాలికపై అత్యాచారం, హత్య

Published: Sunday June 03, 2018


 నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసి ఆ తర్వాత దారుణంగా చంపి ఓ కంటెయిన్‌లో మృతదేహాన్ని దాచిపెట్టిన ఓ నరరూప రాక్షసుడి ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. బాలిక తండ్రికి చెందిన స్వీట్ షాపులోనే నిందితుడు గత తొమ్మిదేళ్లుగా పనిచేస్తున్నాడు. న్యూఢిల్లీకి 80 కిలోమీటర్ల దూరంలోని  ఫరీదాబాద్‌లోని అసోటి గ్రామంలో గత గురువారంనాడు ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. బాలిక హత్యకు ముందే అత్యాచారానికి గురైనట్టు వైద్య పరీక్షల్లో తేలింది.
 
సంఘటన వివరాల ప్రకారం, నిందితుడు భోలు అలియాస్ వీరేందర్ (24) గత గురువారం మధ్యాహ్నం దుకాణం దగ్గర కూర్చున్న బాలికను తనతో ఇంటికి తీసుకు వెళ్లాడు. ఆ తర్వాత అత్యాచారం చేసి ఆపై కత్తితో పొడిచి చంపాడు. పాప మృతదేహాన్ని తన ఇంట్లోని ఓ డ్రమ్‌లో దాచిపెట్టారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు దుకాణానికి వచ్చాడు. సాయంత్రం వరకూ పాప ఆచూకీ తెలియకపోవడంతో పాప తల్లిదండ్రులు ఆమె కోసం గాలించారు. బోలూ సైతం వారితో కలిసి పాప కోసం వెతుకుతున్నట్టు నటించాడు. అయితే పొరుగున ఉన్న ఒక వ్యక్తి పాపను భోలు తీసుకువెళ్లడం చూశానని బాధితురాలి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న స్థానికులు భోలు ఇంటికి వెళ్లడంతో అతని తల్లి వారితో వాదానికి దిగింది. దీంతో ఒక వ్యక్తి మాత్రమే లోపలకు వెళ్లి మృతదేహం డ్రమ్‌లో ఉన్నట్టు గుర్తించాడు. 'మేము పాపను వెతుకుతుంటే భోలూ కూడా మా వెనుకే ఉండి మమ్మల్ని ఫూల్స్ చేశాడు' అని మృతురాలి తండ్రి బావురుమన్నాడు. తమ పాపను పొట్టనపెట్టుకున్న కిరాతకుడికి ఉరిశిక్ష వేయాలని, ఏ తల్లికీ ఇంత గుండెకోత రాకూడదని పాప తల్లి కన్నీరుమున్నీరైంది. ఐపీఎసీలోని వివిధ సెక్షన్లు, పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని  కస్టడీకి పంపినట్టు పోలీసు అధికారి దేవేందర్ సింగ్ తెలిపారు. ఈ ఘాతుకానికి పాల్పడిన భోలు వివాహితుడేనని, అయితే రెండేళ్ల నుంచి అతని భార్య అతనితో ఉండటం లేదని పోలీసులు తెలిపారు.