15 ఏళ్ల బాలికపై యువకుల లైంగిక దాడి

Published: Wednesday June 06, 2018


ఇద్దరు మగాళ్లు మృగాలుగా మారారు. 15 ఏళ్ల బాలికను బెదిరించి లొంగ దీసుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. ఆరు నెలలుగా శారీరకంగా, మానసికంగా చిత్రవధ చేశారు. ఎవరికైనా చెప్తే చంపుతామంటూ బెదిరించడంతో ఆ బాలిక మౌనంగా ఉండిపోయింది. రెండు రోజుల క్రితం బాధితురాలు అస్వస్థతకు గురవడంతో తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లగా గర్భం దాల్చినట్లు వైద్యులు తెలిపారు. దీంతో తల్లి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. హనుమంతునిపాడు మండలం నీలకంఠాపురంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బాలికపై లైంగికదాడి చేసిన ఇరువురినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
నీలకంఠాపురానికి చెందిన ఓ మహిళకు భర్త లేడు. ఆమె తన 15 ఏళ్ల కుమార్తెతో కలిసి కూలి పనులు చేస్తూ జీవిస్తోంది. అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ పెద్ది రమేష్‌ ఆ బాలికపై కన్నేశాడు. తన ఆటోలో రోజూ పనికి వెళ్తుండటాన్ని ఆసరా చేసుకుని ఆమెతో చనువు పెంచుకున్నాడు.
 
ఆ బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో లైంగికదాడికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. అలా ఆమెపై వరుసగా అత్యాచారం చేశాడు. ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన వెంకటచెన్నయ్య కూడా ఆ బాలికను బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇలా వీరిద్దరూ ఆరు నెలలుగా ఆ బాలికపై అత్యాచారం చేస్తున్నారు. వీరి బెదిరింపులకు బయపడిన బాలిక విషయం ఇంట్లో చెప్పలేదు. రెండు రోజుల క్రితం ఆమెకు ఒంట్లో నలతగా ఉండటంతో తల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా గర్భం దాల్చినట్లు బయటపడింది. దీంతో బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.