పెద్దలను ఒప్పించి లవ్ మ్యారేజ్.. కొద్దిరోజులకే ఘోరం

Published: Thursday June 07, 2018
 నగర పంచాయతీ పరిధిలోని ఎస్పీజీ క్వార్టర్స్‌‌లో ఘోరం జరిగింది. అత్తగారింటిలో నివాసం ఉంటున్న తన కూతురు షేక్‌ మాబూచాన్‌ (19)ను 4వ తేదీ రాత్రి భర్త ఇంతియాజ్‌, మామ బాషామొద్దీన్‌, అత్త హబీబూన్‌, మరిది అన్వర్‌ అదనపు కట్నం కోసం శారీరకంగా హింసించి ఉరి వేసి చంపారని మృతురాలి తల్లి సాహిదా, తండ్రి న్యామతుల్లా పేర్కొన్నారు. బుధవారం మృతి రాలి తల్లిదండ్రులు వారి స్వగృహం వద్ద విలేఖరులతో మాట్లాడుతూ తన కూతురు మాబూచాన్‌, ఇంతియాజ్‌ ఒకరినొకరు ఇష్టపడ్డారని, వారి ప్రేమను అంగీకరించి ముస్లిం సాంప్రదాయం ఫిబ్రవరి 8న వారి వివాహాన్ని పెద్దల సమక్షంలో ప్రభుత్వ ఖ్వాజీ ద్వారా జరిపించామన్నారు.
 
 
ఇంతియాజ్‌ చెడువ్యసనాలకు బానిసై జైలు పాలైనా తాను ఆర్థికంగా సాయం చేసి బయటకు తెచ్చానన్నారు. కూతురిపై మమకారంతో అల్లుడిని ఆర్థికంగా ఆదుకున్నప్పటికీ కనికరం, మానవత్వం ఏమాత్రం లేకుండా భర్త, మామ, అత్త, మరిది అందరూ కలిసి తన కూతురిని చంపారన్నారు. పోలీసు కేసు పెట్టానని, తహసీల్దారు పంచనామా నిర్వహించారని తెలిపారు. ఎస్పీ, డీఎస్పీ, సీఐలు న్యాయవిచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని వారు కోరారు.