ప్రేమకు అడ్డుపడుతున్నారని..

Published: Sunday June 10, 2018

ప్రేమకు ప్రియురాలి బంధువులు అడ్డుతగులుతున్నారని ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాజీపేట రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... హసన్‌పర్తి మండలం దేవన్నపేటకు చెందిన ఆడెపు సృజన్‌ (20) వీఎంఆర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో మెకానికిల్‌ డిపార్ట్‌మెంట్‌లో ఫైనలియర్‌ చదువుతున్నాడు. అతడు కొంతకాలంగా అదే కాలేజీకి చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ విషయమై సృజన్‌ తన తండ్రి రాజుకు చెప్పాడు. దీంతో ముందుగా చదువు పూర్తిచేయండి తరువాత వివాహం చేస్తానని రాజు చెప్పాడు. కాగా, ప్రేమ వ్యవహారం తెలి యగానే సృజన్‌ ప్రియురాలి బంధువులు సృజన్‌పై గతంలో దాడి చేశారు. తీవ్రం గా మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సృజన్‌ వడ్డేపల్లి రైల్వే ట్రాక్‌వద్ద గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని జేబులో సూసైడ్‌ నోట్‌ దొరికింది. సూసైడ్‌ నోట్‌లో మా ప్రేమకు ప్రియురాలి బంధువులు అడ్డుతగులుతున్నాడని అందుకే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రాసి ఉందని పోలీసులు తెలిపారు. రైల్వే ఉద్యోగుల సమాచారం మేరకు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఎంజీఎంలో పోస్ట్‌మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు వారు చెప్పారు. అతడి తండ్రి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై కె. జితేందర్‌ రెడ్డి తెలిపారు.