భార్య మటన్ వండి పెట్టలేదని... కోపంతో

Published: Monday June 11, 2018

 మటన్ వండి పెట్టలేదనే కోపంతో ఓ మందు బాబు తన భార్యను ఇనుపరాడ్డుతో కొట్టి, మూడో అంతస్తు నుంచి కిందకు తోసేసి చంపిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. ఫిరోజాబాద్ జిల్లా పచ్వాన్ కాలనీకి చెందిన మనోజ్ కుమార్, రాణిలు భార్యాభర్తలు. ఐదేళ్ల క్రితం వీరి పెళ్లి అయింది. భర్త మనోజ్ కుమార్ పీకల దాకా మద్యం తాగి వచ్చి భార్య రాణిని నిత్యం వేధించే వాడు. భార్య రాణి మటన్ వండి పెట్టలేదనే కోపంతో మద్యం తాగి వచ్చిన మనోజ్ కుమార్ ఇనుపరాడ్డు తీసుకొని కొట్టాడు. దీంతో స్పృహ కోల్పోయిన రాణిని భర్త తన తండ్రి, తమ్ముడితో కలిసి మూడో అంతస్తు నుంచి కిందకు పడేసి ప్రమాదంగా నమ్మించాడు. మటన్ వండి పెట్టలేదని తన కూతురైన రాణిని భర్త, అత్తింటివారు చంపారని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి మనోజ్ తండ్రి, తమ్ముడిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు మనోజ్ కోసం గాలిస్తున్నామని పోలీసులు వివరించారు.