పెళ్లి అయిన 45 రోజులకే బలవన్మరణం
Published: Friday June 15, 2018

మండలంలోని గోకులపాడులో నవ వధువు గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. వివాహమైన 45 రోజులకే ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీనికి సంబంధించి ఎస్‌ఐ రాయవరం ఎస్‌ఐ కే కుమారస్వామి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఎస్.రాయవరం మండలం గోకులపాడు గ్రామానికి చెందిన పావని (20)కి నక్కపల్లి మండలం తమ్మయ్యపేటకి చెందిన సూరకాసుల నాగశ్రీనుకు ఇచ్చి ఏప్రిల్ 29న పెద్దలు వివాహం జరిపించారు. పావని 15 రోజుల క్రితం అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చింది. రెండు రోజుల నుంచి జ్వరం, కడుపునొప్పి ఎక్కువగా వుండడంతో గురువారం మధ్యాహ్నం ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో పావని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఆమె తల్లిదండ్రులు ఆకుల నూకరాజు, లక్ష్మి, ఫిర్యాదు చేశారని ఎస్‌ఐ చెప్పారు. పెళ్లయిన 45 రోజులకే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటనతో గోకులపాడులో విషాదం అలుముకుంది. అందిన ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని నక్కపల్లి 30 పడకల ఆస్పత్రి మార్చురీకి తరలించారు. శవపంచనామా అనంతరం పోస్టుమార్టమ్ జరిపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు.

Share this on your social network: