ఉత్తరాది నుంచి వాహనాల్లో రాక..... గగన విహారంలో గ్యాంగ్ లీడర్
Published: Monday June 18, 2018

టార్గెట్ ఫిక్స్ చేస్తే ఆ ఫ్లాట్ తాళం పగిలిపోవాల్సిందే. సరిగ్గా పది నుంచి పదిహేను నిమిషాల్లో పని ముగించేయడమే. ఇదీ ఉత్తరాది గ్యాంగ్ చోరీల స్టైల్. ఏ నగరాన్ని అయితే ఎంచుకుంటారో అక్కడకు వాహనాల్లో వస్తారు. ప్రధాన సూత్రధారి మాత్రం విమానంలో చేరుకుంటాడు. భద్రత తక్కువగా ఉన్న అపార్ట్‌మెంట్లను లక్ష్యంగా చేసుకుంటారు. మర్నాడు పని పూర్తి చేసుకుంటారు. ఇలా విజయ వాడలో వివిధ అపార్ట్‌మెంట్లలో ఎనిమిది చోరీలు చేసిన అంతరాష్ట్ర ముఠాలోని ఇద్దరు సభ్యులను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మూడు కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను నగర సంయుక్త పోలీసు కమిషనర్ టి.కాంతి రాణా, ఉపకమిషనర్ డాక్టర్ గజరావు భూపాల్, సీసీఎస్ ఉపకమిషనర్ షహీన్‌బేగం ఆదివారం ఆపరేషనల్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వెల్లడించారు.
హరియాణకు చెందిన సత్పాల్‌సింగ్... గుర్గావ్ ప్రాంతానికి చెందిన ప్రీత్‌పాల్ టాక్రాన్, రాజస్థాన్‌లోని పిలానీ ప్రాంతానికి రాజీవ్‌సోనీ, పర్మిందర్, జితేందర్, సాధుతో కలిసి ఒక గ్యాంగ్‌ను ఏర్పాటు చేశాడు. దాదాపుగా ఇలాంటి పది బృందాలతో వివిధ రాష్ట్రాల్లో చోరీలు చేయిస్తాడు. ఈ గ్యాంగ్ టార్గెట్ అంతా భద్రత లేని అపార్ట్‌మెంట్లే. ఢిల్లీ నుంచి ఈ గ్యాంగ్ వాహనాల్లో బయలుదేరి ఆయా నగరాలకు చేరుకుంటుంది. ప్రధాన సూత్రధారి సత్పాల్ మాత్రం విమానాల్లో చేరుకుంటాడు. గతేడాది అక్టోబర్, ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు విమానాల్లో సత్పాల్ వచ్చాడు. అక్కడి నుంచి కారులో విజయవాడకు చేరుకున్నాడు. మిగిలిన సభ్యులు ప్రీత్‌పాల్ టాక్రాన్, రాజీవ్‌సోనీతోపాటు ఇతరులంతా ప్రత్యేక వాహనాల్లో వచ్చారు. మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలోని హోటళ్లలో బస చేశారు. అక్కడి నుంచి కారుల్లో బయలుదేరి నగరంలోని వివిధ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు.

Share this on your social network: